ఆపరేషన్‌ నకిరేకల్‌లో టీఆర్ఎస్‌కు తెలిసొచ్చింది ఏంటి?

Update: 2019-06-18 07:39 GMT

అధికార పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఓ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మరో ఇద్దరు సీనియర్ నేతలున్న నియోజకవర్గమది. అయినా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యింది ఆ నియోజకవర్గమే. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అన్ని నియోజకవర్గాల మాదిరిగా అక్కడి నుంచి కొద్ది మెజార్టీ వచ్చినా సునాయసంగా గట్టెక్కేది కారు పార్టీ. కానీ అంతమంది సీనియర్ నేతలున్నా, తమ పార్టీకి ఎందుకు ఎదురుగాలి వీచిందనే దానిపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారట. మరి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కారు బోల్తాపడ్డ ఆ నియోజకవర్గం ఏది.

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం. భువనగిరి పార్లమెంట్ పరిధిలోకొస్తుందీ ఈ నియోజకవర్గం. 2009 నియోజకవర్గ పునర్విభజనకు ముందు కమ్యూనిస్టులకు కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్ పట్టు సాధించినా, 2014లో గులాబీ జెండా ఎగిరింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచిన చిరుమర్తి లింగయ్య ప్రస్తుతం గులాభీ తీర్థం పుచ్చుకున్నారు. లింగయ్య గెలుపుకు, టిఆర్ఎస్ నుంచి వేముల వీరేశం‌ ఓటమికి మొత్తం నియోజకవర్గంలోని టిఆర్ఎస్ నేతలే కారణమని అధిష్టానం గుర్తించి నేతలకు క్లాస్ ఇచ్చింది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ క్రాస్‌ ఓటింగ్ జరిగిందని రగిలిపోతోంది టీఆర్ఎస్.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సగం మంది సీనియర్‌ హేమాహేమీలు నకిరేకల్‌ వారే. ఆయా నేతలకు తోడుగా కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరారు. వీరి చేరికతో పార్టీ పటిష్టమవుతుందని భావించిన గులాబీ బాస్‌కు, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. ఈ నియోజకవర్గంలో 11 వేలకు పైగా కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. ఓవరాల్‌గా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4,447 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. పార్టమెంట్ పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్‌కు, నకిరేకల్ మాత్రం పెద్ద దెబ్బకొట్టింది. అదే గులాబీ శ్రేణులను కలవరపెడుతోంది. కేవలం నకిరేకల్్ మెజార్టీతోనే భువనగిరి ఎంపీగా గెలిచారు కోమటిరెడ్డి. అంటే నకిరేకల్‌లో టీఆర్ఎస్‌కు మెజార్టీ వచ్చి వుంటే, భువనగిరి ఎంపీ సైతం గులాబీ కోటాలోనే ఉండేది. మరి తక్కువ మెజారిటీ ఇక్కడ ఎందుకొచ్చిందని, పోస్టుమార్టం మొదలుపెట్టింది గులాబీ అధిష్టానం.

నకరికల్లు నియోజకవర్గంలో నేతల సమన్వయలోపం‌ ఓ రేంజ్‌లో ఉంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల‌ నర్సింహయ్య, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, శాసనమండలి డిప్యూటి చైర్మెన్ నేతి విద్యాసాగర్, ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బిసి ఆర్ధికాభివృద్ధి సంస్థ చైర్మన్ శంభయ్య లాంటి సీనియర్ నేతలకు సొంత నియోజకవర్గం నకిరేకల్. తాజాగా కారెక్కిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యరాకతో పార్టీ మరింత బలపడిందని ఆదినాయకత్వం భావన. అయినా వీళ్ల సొంత గ్రామాల్లోనూ కారు చతికలపడడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. నకిరేకల్ నియోజకవర్గంపైనే ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్ది బూర నర్సయ్య గౌడ్, ఫలితాలు చూసి బిత్తరపోవాల్సి వచ్చింది. ఫలితాల అనంతరం గులాబీ బాస్ కూడా నియోజకవర్గ నేతలందరినీ పిలిచి మరీ క్లాస్ తీసుకున్నట్లు టాక్.

అయితే నకిరేకల్‌లో మెజార్టీ రాకపోవడానికి రాజకీయ విశ్లేషకులు రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. అవేమిటంటే నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఓ కారణమయితే, గ్రూపు గొడవలు ప్రధాన కారణంగా చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీలో చేరిన కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డిల చేరికలతో గ్రూపులు మరిన్ని పెరిగాయి. దీంతో నేతల మధ్య సమన్వయం కొరవడిందనే వార్తలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి పదవులు ఇవ్వకపోవడం, కొత్తగా చేరిన వారికి అధిక ప్రాదాన్యత ఇవ్వడం వంటి పరిణామాలు పార్టీ ఓటమికి కారణమని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు ఉంది టీఆర్ఎస్ నేతల పరిస్థితి. నకిరేకల్‌‌లో తన‌ఓటమికి ఆయా నేతలంతా‌ పనిచేయలేదని ఇప్పటికే వీరేశం‌ ఫిర్యాదు చేశారు. అదీ మరవకముందే నకిరేకల్‌లో అరడజనుకుపైగా ఉన్న గ్రూపులను ఒక్కతాటికిపైకి తీసుకొచ్చి సక్సెస్ కాలేని పరిస్థితి టిఆర్ఎస్‌ది. ఇంతమంది నేతలున్నా మెజారిటీ రాకపోగా, ఇద్దరు మాత్రమే ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపుకు నకిరేకల్‌ మాత్రమే కారణం కావడం టిఆర్ఎస్ నేతలను ఆలోచనలో పడేసింది. అసెంబ్లీ సీటు ఓడిన తర్వాతైనా, కళ్లు తెరుస్తారని టిఆర్ఎస్ అధిష్టానం భావించినా పార్లమెంటులో వెనుకబడటంతో‌ పెద్ద సార్ దగ్గర ముఖం‌ చూపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని క్యాడర్‌లో చర్చ నడుస్తోంది. ఎవరు గెలిచినా ఓడినా పర్వాలేదు కానీ కోమటిరెడ్డిని ఓడించాలని ఫ్లాన్ చేసి‌, నల్గొండలో ఓడిస్తే, మరో అవకాశంగా భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి విజయం సాధించడం, నకిరేకల్‌ ‌టిఆర్ఎస్ నేతలకు‌‌మింగుడు పడటం లేదని విస్తృతంగా చర్చ నడుస్తోంది.

Full View

Tags:    

Similar News