ఆ మాజీ ఎంపీ పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారా.....? మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్‌లోనూ పాల్గొంటారా...? పెద్దల సభ ఖరారుతో ఆమె స్పీడు పెంచారా...? సంక్రాంతి తర్వాత ఆమె రీ ఎంట్రీ అవుతారంటూ జరుగుతున్న ప్రచారంతో ఆ జిల్లా నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు....? పసుపు రైతుల ఉద్యమానికి ఆమె నాయకత్వం వహిస్తారనే ప్రచారంలో నిజమెంత...? అసలు ఆ మాజీ ఎంపీ పొలిటికల్ రీ ఎంట్రీపై జరుగుతున్న చర్చేంటి...?
రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే ఆమె పార్లమెంట్ ఎన్నికల అనంతరం సైలెంట్ అయ్యారు. కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు పనిగట్టుకుని ఆమె ఓటమికి కారణమయ్యారని అప్పట్లో పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఆ మాజీ ఎంపీ రహస్య విచారణ చేయించారట. ఈ విషయం రాష్ట్రస్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. విచారణలో నిజం తెలుసుకున్నారట మాజీ ఎంపీ కవిత. అందుకే కొద్ది రోజులుగా రాజకీయాలకు, వివిధ వేడుకలకు దూరంగా ఉన్నారట. జిల్లా నేతలకు ఎవరిని కలిసేందుకు ఇష్టపడలేదట. కానీ కొద్ది రోజులుగా ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారట. వివిధ వేడుకల్లో పాల్గొంటూనే, తన ముఖ్య అనుచరులను కలుస్తున్నారట.
ఆమె పొలిటికల్ సైలెంట్‌తో కొందరు ఎమ్మెల్యేలు పండగ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఐతే రాజ్యసభ సభ్యురాలి హోదాలో అతి త్వరలో మళ్లీ యాక్టివ్ కాబోతున్నారనే సమాచారంతో, కొందరు నేతలకు మింగుడు పడటం లేదట. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్‌లోనూ ఆమె యాక్టివ్‌గా పాల్గొంటారనే ప్రచారంతో అలెర్ట్ అయిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ శాఖ మంత్రిని ఎవరికి వారే కలుస్తున్నారట.
అతి త్వరలో ఖాళీ అయ్యే ఓ రాజ్యసభ సభ్యుని స్థానంలో కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యురాలిగా ఢిల్లీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారట. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల్లో తన మార్క్ ప్రచారంతో గులాబీ జెండా ఎగురేస్తారనే ధీమాలో పార్టీ అధిష్ఠానం ఉంటే, ఆమె వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని ఆమె అనుచరులు ఎదురుచూస్తున్నారట. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం, తామే ఆ బాధ్యతలు చూస్తామని అనుచరుల వద్ద వాపోతున్నారట. మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆ మాజీ ఎంపీ తీసుకోరని చెబుతున్నారట. కానీ కవిత రాక కోసం ఎదురుచూస్తున్న నేతలు, కార్యకర్తలు మాత్రం ఆలస్యం జరిగినా రావడం పక్కా అంటుండటం, అందుకు అనుగుణంగా కవిత మళ్ళీ యాక్టివ్ కావడంతో కొందరిలో మోదం మరి కొందరిలో ఖేదం ఉందట. మళ్ళీ పాత రోజులు వస్తాయని కొందరు ఖుషిగా ఉంటే మరికొందరు మాత్రం ఆ పాత రోజులతో తమ ప్రాధాన్యం తగ్గుతుందని దిగులు పడుతున్నారట.
జిల్లాలో తన మార్క్ రాజకీయం చూపెట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న కవితకు పసుపు రైతుల అంశం ఓ అస్త్రం గా మారిందట. పసుపు రైతుల ఉద్యమానికి కవిత నాయకత్వం వహించాలని మహిళా రైతుల నుంచి డిమాండ్ వస్తుండటంతో, పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే చర్చ చేశారట ఆ మాజీ ఎంపీ. గతంలో తాను చేసిన ప్రయత్నాలను వివరించటంతో పాటు పసుపు బోర్డు, మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్న రైతులకు అండగా ఉండేందుకు పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ పాదయాత్ర ఎంత వరకు ప్లస్, ఎంత వరకు మైనస్ అనే అంశంపై తన దగ్గరకు వచ్చిన నేతలతో చర్చించారట. యాత్రపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, రైతుల నుంచి ఒత్తిడి పెరిగితే ఉద్యమంలోకి రావడం ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారట.
కవితక్క రాజ్యసభ సభ్యురాలి హోదాలో జిల్లాలో అడుగు పెడుతారా, మాజీ ఎంపీగా రైతుల ఉద్యమంలో పాల్గొంటారా, పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మున్సిపల్ ఎన్నికల ప్రచారాంలో పాల్గొంటారా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.