తెలంగాణ బీజేపీలో కొత్తగా కేంద్రమంత్రి అయ్యారన్న సంతోషం కిషన్ రెడ్డికి లేకుండా పోయింది. కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకుని నెలరోజులు గడవకముందే, ఆయనకు జాతీయపార్టీ అప్పగించిన బాధ్యత రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేందని పార్టీ నేతలే చర్చించకుంటున్నారు. ఇంతకీ కిషన్ రెడ్డికి వచ్చిన కొత్త తలనొప్పి ఏంటి?
ఎమ్మెల్యేగా ఓడినా, ఎంపీగా గెలిచి ఏకంగా కేంద్రమంత్రి అయ్యారు కిషన్ రెడ్డి. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పడిన కష్టానికి ఫలితం చూశారు. ఎమ్మెల్యేగానూ అసెంబ్లీలో ధాటిగా మాట్లాడి, శభాష్ అనిపించుకున్న ట్రాక్ రికార్డుంది కిషన్ రెడ్డికి. ముఖ్యంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వాన్ని గట్టిగానే వ్యతిరేకించారు. పార్టీకి రాజీనామా చేయకుండా, మరో పార్టీలోకి ఎలా వెళతారంటూ కేసీఆర్‌ను అనేకసార్లు ప్రశ్నించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టిడిపిలో గెలిచి, టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే, ఇదే కిషన్ రెడ్డి బిజేపి ఫ్లోర్ లీడర్‌గా అనేక ఆరోపణలు చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలిచిరావాలని సవాల్ విసిరారు. కట్ చేస్తే, ఇప్పడు ఇదే బీజేపీ కూడా అదే పని చేసింది. ఫిరాయింపుదార్లను దగ్గరపెట్టుకుని మరీ, కాషాయతీర్థం ఇప్పించారు కిషన్ రెడ్డి. అదే ఇప్పుడాయనకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.
నలుగురు తెలుగుదేశం రాజ్యసభ ఎంపీల కాషాయతీర్థం క్రతువును, కిషన్‌రెడ్డితో నిర్వహించింది బీజేపీ అధిష్టానం. తెలుగు రాష్ట్రాల నుంచి వలసల ప్రక్రియను చూసుకోవాలని కిషన్ రెడ్డికి అప్పగించింది. దీంతో నలుగుర్నీ వెంటబెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకెళ్లారు కిషన్ రెడ్డి. అంతేకాదు, సుజనా చౌదరిపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవని వత్తాసు పలకడం కూడా, కిషన్ రెడ్డి పరపతిని మసకబారుస్తోందని, అనుచరులే మాట్లాడుకుంటున్నారు.
మొన్నటి వరకూ ఫిరాయింపులు, టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేసిన కిషన్ రెడ్డి, చివరికి వారిని కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం, వారి తరపున వకాల్తా పుచ్చుకోవడంపై తెలంగాణ రాజకీయాల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కిషన్ రెడ్డి, ఎలా మారిపోయాడని అందరూ పెదవి చిట్లిస్తున్నారు. పదేపదే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే కిషన్ రెడ్డి, ఇప్పుడెలా సమర్థించుకుంటారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. పాపం కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఎంత పనిచేయించిందో చూడండి అంటూ పార్టీలో మాట్లాడుకుంటున్నారు.