కాంగ్రెస్‌లో అప్పుడే హుజూర్‌ మథనం మొదలైందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ‍హుజూర్ నగర్ ఉప ఎన్నిక, తమకు పూర్వవైభవం తెచ్చిపెడుతుందని భారీ ఆశలే పెట్టుకుంది. ఈ బైపోల్‌ ద్వారా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళూరింది.

Update: 2019-10-23 06:10 GMT

అంతన్నారు. ఇంతన్నారు. ఆశల పల్లకీలో చక్కర్లు కొట్టారు. ఊహల ఉయ్యాల ఊగుతూ తేలియాడారు. ఇక చూస్కో, రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తామని తొడకొట్టారు. కానీ ఫలితం రాకముందే, చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నారు ఆ నాయకులు. రిజల్ట్‌ రాకముందే, ఆ లీడర్లకు అంత భయమెందుకు?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ‍హుజూర్ నగర్ ఉప ఎన్నిక, తమకు పూర్వవైభవం తెచ్చిపెడుతుందని భారీ ఆశలే పెట్టుకుంది. ఈ బైపోల్‌ ద్వారా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళూరింది. పార్టీ ముఖ్యనేతలందరినీ ఏకం చేసి జోరుగా ప్రచారం చేసింది. పిసిసి అధ్యక్షుడి సిట్టింగ్ సీటు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీలో విభేదాలున్న నేతలను సైతం ప్రచారానికి రప్పించి, కాంగ్రెస్‌లో విభేదాలు తాత్కాలికమే అనే భావనను కల్పించి, ప్రజల్లో కన్‌ఫ్యూజన్‌ లేకుండా చేసింది. మొత్తానికి పోలింగ్‌ ముగిసింది. కానీ అసలు టెన్షన్‌ ఇప్పుడే మొదలైంది కాంగ్రెస్‌కు.

అధికార పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత, హూజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని హస్తం పార్టీ లెక్కలు వేసుకుంది. దీనికి తోడు ఉప ఎన్నికల ప్రచారం జోరందుకోగానే, ఆర్టీసీ సమ్మె కూడా ఉధృతం కావడంతో, ఇదీ కూడా తమకు లాభిస్తుందని అంచనాలు పెంచుకుంది కాంగ్రెస్. ఎట్టి పరిస్థితిల్లోనూ తాము గెలవడం ఖాయమనే భావన పోలింగ్ తేది వరకు హస్తం పార్టీలో కనిపించింది. అయితే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు, కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు చల్లాయి.

పోలింగ్‌ ముగిసిన వెంటనే, మిషన్‌ చాణక్యతో పాటు వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్‌ పల్స్‌ను పడగొట్టాయి. దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్, హుజూర్‌ నగర్‌లో టీఆర్ఎస్‌ విజయఢంకా మోగిస్తుందని బజాయించాయి. దీంతో నిన్నటి వరకు గెలుపు తమదేనని, ఇక చెలరేగిపోతాం అన్న జోష్‌లో వున్న కాంగ్రెస్ నేతలకు, ఎగ్జిట్‌పోల్స్‌ నిరుత్సాహ పరిచాయి.

ఈ ఉప ఎన్నికల్లోనైనా టిఆర్ఎస్‌ను ఓడించి ప్రజల్లోకి తలెత్తుకొని వెళ్లి భవిష్యత్తు పట్ల కార్యకర్తలకు భరోసా ఇద్దమనుకుంది కాంగ్రెస్‌. కానీ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో ఆ పార్టీ నేతల ఆశలు ఆవిరి అయ్యాయట. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం రుచి చూడకంటే భవిష్యత్తులో పార్టీ ఏమవుతుందోననే ఆందోళన, నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు సిట్టింగ్ సీటును కూడా కాపాడుకోలేని వారు, పార్టీని ఏం కాపాడుకుంటారనే విమర్శల గురించి, ఆలోచిస్తేనే కాంగ్రెస్ నేతల్లో గుబులు పుడుతోందట. హుజూర్ నగర్ గెలుపు తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్ అనే మాటలు ఊహించుకుని, కాంగ్రెస్ నేతలు కలవర పడుతున్నాట. ముఖ్యంగా తన పరపతి ఎక్కడ తగ్గుతుందోనని, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి టెన్షన్‌ పడుతున్నారట. అయినా, ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ కంటే వారి సొంత ధీమా కాంగ్రెస్ పార్టీలో ఓదార్పునిస్తోంది. వారి కలులు నిజమవుతాయో లేక ఎగ్జిల్ పల్స్ నిజమవుతాయో చూడాలి.

Full View   

Tags:    

Similar News