HMDA EX Director: శివ బాలకృష్ణ విచారణలో నమ్మలేని నిజాలు.. మూడు లాకర్‌లు ఓపెన్ చేయనున్న ఏసీబీ
HMDA EX Director: 4 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా
HMDA EX Director: అక్రమాల అవినీతి పుట్ట HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మూడో రోజు ఎసిబి కస్టడీ విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలినట్లు అక్రమాలను వెలికితీసేందుకు ఎసిబి సిద్ధమైంది. ఎసిబి కస్టోడియల్ విచారణలో బినామీలు, అక్రమ ఆస్తులు, బ్యాంకు లాకర్లపై ప్రశ్నలు సంధిస్తూ ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారిస్తూ స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు.
అధికారంలో ఉంటె ఏదైనా చెయ్యొచ్చా..! అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలకు వచ్చిన బహుమతులు, అక్రమ ఆస్తుల వాళ్ళ మొదట సుఖాలు అనుభవించిన ఇప్పుడు కష్టాలుగా మారాయి. ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులను ఇప్పటికే ఎసిబి లెక్కకట్టింది. 100 కోట్లకు పైగా ఆస్తులు బహిరంగ మార్కెట్ విలువ ఉంటాయని ఎసిబి భావిస్తుంది. అందులో భాగంగా ఎసిబి మూడు రోజుల పాటు జరిగిన విచారణలో నమ్మలేని నిజాలను సేకరిస్తుంది.
మొదటి రోజు కస్టడీలో భాగంగా చంచల్‌గూడ జైలు నుండి శివబాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎసిబి కస్టడీలోకి తీసుకుంది. మొదటిరోజు 7 గంటలకు పైగా ప్రత్యేక గదిలో శివ బాలకృష్ణను విచారించింది. అక్రమ ఆస్తులు, అతను అధికారంలో ఉన్న సమయాల్లో ఏయే శాఖల్లో ఎవరెవరు టచ్ లో ఉన్నారు. ఎన్ని అక్రమ పర్మిషన్స్ ఇచ్చారన్న కోణంలో విచారించింది.
విచారణలో దాదాపు 75 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఏసీబీ. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం శివ బాలకృష్ణను ప్రశ్నించింది. ఈ విచారణను వీడియో,ఆడియో రికార్డింగ్ చేశారు. బుధవారం మొదటి రోజు విచారణలో శివబాలకృష్ణకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అందుకున్న జీతం సహా శివబాలకృష్ణ పేరుతో ఉన్న ఆస్తులపై ఆరా తీశారు. ప్రత్యేక గదిలో సాయంత్రం 7గంటల వరకు విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు.
గురువారం రెండొవరోజు మళ్లీ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను ముందుంచి ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, రాయదుర్గం మై హోం బూజాలో డింగరి కిరణ్ ఆచార్య, హనుమకొండ భవానీనగర్‌లో సింగరాజు ప్రమోద్‌కుమార్, మాదాపూర్ సాహితి సుముఖి ఆర్బిట్ ఆపార్ట్‌మెంట్, హబ్సిగూడ వీవీనగర్‌లో కొమ్మిడి సందీప్ కుమార్ రెడ్డి పేరుతో ఉన్న ఫ్లాట్ల డాక్యుమెంట్ల గురించి ఏసీబీ విచారణలో ప్రశ్నించారు.
బాచుపల్లి శిల్ప ఆర్‌వీ ధరిస్తా అపార్ట్‌మెంట్‌లో జి.సత్యనారాయణ మూర్తి పేరుతో ఉన్న ఫ్లాట్ వివరాలు సేకరించారు. వీటితోపాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని సాయి సందీప్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, కొత్తపేట ఆర్‌కేపురంలోని ఎస్‌ఎస్ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన వివరాలు అడగ్గా వాటితో తనకెలాంటి సంబంధంలేదని చెప్పినట్లు సమాచారం
శుక్రవారం మూడోవ రోజు విచారణలో శివ బాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీశారు. అలాగే పలు బ్యాంకు లాకర్లను పరిశీలించారు. అయితే బ్యాంకు లాకర్ల వివరాలు గొప్యంగా ఉంచారు. 4 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా తీసిన ఏసీబీ అధికారులు.. ఇల్లీగల్ లే అవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలపై ఆరా తీశారు.
ఆయన బినామీలు సత్య అండ్ మూర్తితో ఉన్న లింక్స్‌పై విచారణ జరిపారు. మూడు రోజుల నుండి జరిపిన విచారణలో అక్రమ ఆస్తులు, బినామీలపై క్లారిటీ కోసం ప్రశ్నిస్తున్నారు.. ఎసిబి దగ్గరున్న సమాచారం శివబాలకృష్ణ దగ్గర నుండి వస్తున్న క్లారిటీ వీటన్నింటిని టాలీ చేస్తున్నారు.
4వ రోజు మరోసారి కస్టడీలోకి తీసుకొని శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరు పై ఉన్న మూడు లాకర్ లను గుర్తించారు. ఆ మూడు లాకర్ లను ఓపెన్ చేయనున్నారు. సోదాల సమయంలో నోరుమెదపని శివబాలకృష్ణ ప్రస్తుతం జరుగుతున్న కస్టోడియల్ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు కొద్ది కొద్దిగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే లాకర్లు,బినామీ ఆస్తులపై క్లారిటీ వస్తే వాటన్నింటిని ఎసిబి పక్కాగా గుర్తించనుంది. ఇప్పటికే శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన బినామీ కంపెనీలపై ఆరా తీస్తుంది. శివబాలకృష్ణ నోరు మెదిపితే మాత్రం అతని హయాంలో వెనుకుండి నడిపించిన రాజకీయ పెద్దలు, ఉన్నతాధికారులు చిట్టా బయటపడనుంది.