TS Congress: మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి నినాదం సక్సెస్

TS Congress: ఫలితాన్ని ఇవ్వని బీజేపీ బీసీ,ఎస్సీ మంత్రం

Update: 2023-12-03 13:09 GMT

TS Congress: మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి నినాదం సక్సెస్

TS Congress: మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి. ఈ నినాదం జనాలకు బాగా ఎక్కింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ చేసిన ఈ క్యాంపెయిన్‌కు జనాలు జై కొట్టారు. ఎలాంటి అనుమానం లేకుండా కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ప్రభుత్వంపై సహజంగా ఉన్న వ్యతిరేకతకు తోడు.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించారు. 10 ఏళ్లు కేసీఆర్ పాలన చూసిన తెలంగాణ ప్రజానీకం.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ చేతికి ఈ సారి అధికారం కట్టబెట్టింది.

కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలన్న పరిస్థితికి ఏఐసీసీ చెక్ పెట్టింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే చర్యలంటాయని ఎన్నికలకు ఆరు నెలల ముందే హెచ్చరించింది. అప్పటి వరకు కుమ్ములాటలకు కేంద్రంగా ఉన్న గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఆదేశాలతో నిశబ్దతావాతరణం నెలకొంది. 10 ఏళ్లుగా ఎవరి గేమ్ వారిదే అన్నట్లు కాంగ్రెస్‌లో పరిస్థితి ఉండేది. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేవారు. కట్ చేస్తే ఎన్నికల సమయానికి అంతా ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కుమ్ములాటలను పక్కన పెట్టి ప్రభుత్వంపై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి సక్సెస్ అయ్యారు.

ఆరు... కేసీఆర్ లక్కీ నెంబరు. ఇన్నాళ్లూ ఆరంటే కేసీఆర్ సారేనంటూ చెప్పేవాళ్ల బీఆర్ఎస్ నేతలు. కాని తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 6 నెంబర్ కేసీఆర్‌కే కాదు.. బీఆర్ఎస్‌కు కూడా కలిసి రాలేదు. ఇన్ని రోజులు సారు, కారు వెంట నడిచిన నెంబర్ ఆరు.. ఇప్పుడు కాంగ్రెస్ వైపు నిలిచినట్లు కనిపిస్తోంది. ఆరు గ్యారెంటీలంటూ హస్తం పార్టీ ఇచ్చిన హామీతో తెలంగాణ ప్రజలు ఏకీభవించారు. సిక్స్ గ్యారెంటీ కార్డుకే ప్రజలు జై కొట్టారు.

కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు.. బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. ఏడాది క్రితం నుంచే అనేక సర్వేలు చేయించారు గులాబీ దళపతి కేసీఆర్. చాలా సర్వేల్లో ఎమ్మెల్యేలపై స్పష్టమైన వ్యతిరేకత ఉందని తేలిపోయింది. అయితే మెజార్టీ స్థానాల్లో సిట్టింగులను మార్చితే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ భావించారు. దీంతో దాదాపు 95శాతం సీట్లను సిట్టింగులకే కేటాయించారు. దీంతో ఎమ్మెల్యేలపై తమకున్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో తెలిపారు తెలంగాణ ప్రజలు.

సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోతే వారు పక్కపార్టీలకు వెళ్తారని కేసీఆర్ అంచనా వేశారు. ఉన్న బలమైన అభ్యర్థులను కోల్పోతే కొన్ని నియోజకవర్గాలను కోల్పోతామని కేసీఆర్ లెక్కలేశారు. సిట్టింగులకు సీట్లు ఇచ్చి.. ఎమ్మెల్యేలు కాదు.. కేసీఆర్,అభివృద్ధి ప్రాతిపదిగా ఓట్ల అడిగానా ఫలితం లేకపోయింది. కేసీఆర్‌ను చూసి ప్రజలు ఓట్లేసేందుకు సైతం విముఖత చూసినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే.. కాంగ్రెస్‌కు గంపగుత్తగా ఓట్లు పడేలా చేసిందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

సీఎంగా కేసీఆర్‌పై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ఓవరాక్షన్ కేసీఆర్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టాయన్న అంచనాలు ఉన్నాయి. 2014లో అధికారం చేపట్టిన తర్వాత పాలనపై పట్టుబిగించిన కేసీఆర్ 2018లో రెండో సారి లైట్ తీసుకున్నారని.. దాంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారని తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల యుద్ధంలో చివరి నిమిషంలో సీన్‌లోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ పార్టీని ప్రజలు పట్టించుకోనట్లు కనిపిస్తోంది. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ వంటి హామీలు ఇచ్చినా ఆ రెండు వర్గాల నుంచి బీజేపీకి ఆదరణ లభించలేదు. మోడీ, అమిత్ షా వంటి బడా నేతలు తెలంగాణలో సభలు రోడ్ షోలు నిర్వహించినా..అప్పటికే ఎన్నికలు సమీపించడం ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయాలో ఓ నిర్ణయానికి రావడం జరిపోయనట్లు స్పష్టమైంది. దీంతో బీజేపీ ఆశించిన మేర సీట్లు రాబట్టంలో సక్సెస్ కాలేకపోయింది.

Tags:    

Similar News