గ్రేటర్‌ గులాబీలో కొత్త గలాట మొదలైందా?

Update: 2019-08-17 12:04 GMT

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నేతల తీరు, అధిష్టానానికి ఇబ్బందిగా మారిందా పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలైన నేతల మధ్య రగడ, ఇప్పటికీ కంటిన్యూ అవుతుండటం, హైకమాండ్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతోందా ఇప్పుడు తాజాగా మరోసారి గ్రేటర్ లీడర్ల మధ్య రచ్చకొచ్చిన వివాదమేంటి ఎవరికివారే యమునా తీరే అన్నట్టు సాగుతున్న నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు, కఠిన నిర్ణయాలకు కేటీఆర్‌ సిద్దమవుతున్నారా.

గ్రేటర్ హైదరాబాద్ గులాబీ నేతల మధ్య కోల్డ్ వార్ పీక్‌ స్టేజ్‌కి చేరుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్ల మధ్య విభేదాలు రచ్చరచ్చవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడ్డ విబేధాలు, ఇప్పటికీ కొనసాగుతున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలను నియమించి మరీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది గులాబీ పార్టీ. పాత కొత్త అని తేడా లేకుండా నాయకులంతా కలిసి అనుకున్న విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని, గులాబీ బాస్ ఆదేశిస్తే గ్రేటర్‌లో మాత్రం నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దాని ఫలితంగానే సిటీలోని చాలా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ఇంకా పూర్తి కాలేదు. ఇదే గులాబీ బాస్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల మధ్య సరైన కోర్దినేషన్ లేకుండా పోయింది. అప్పుడు ఎమ్మెల్యేలు సహకరించడం లేదని పార్టీ పెద్దలకు ఎంపీ అభ్యర్థులు ఫిర్యాదు కూడా చేశారు. పార్టీ నిర్వహించిన బహిరంగ సభలకు కూడా నాయకులు జనసమీకరణ చెయ్యడంలో విఫలమయ్యారు. దానికి కారణం నేతల మధ్య సమన్వయలోపంగా గుర్తించిన పార్టీ ఎన్నికలకు ముందు సిటీ నేతలకు క్లాస్ కూడా తీసుకున్నారు. అయినా సరే నేతలు మారలేదు. దీంతో కచ్చితంగా గెలుస్తాం అనుకున్న స్థానాలు కూడా కోల్పోయింది టిఆర్ఎస్.

అయితే తాజాగా తెలంగాణ భవన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై గ్రేటర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. జిల్లాలతో పోలిస్తే సిటీలో చాలా తక్కువగా సభ్యత్వం నమోదు అవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు, ఇగోల వల్లే కార్యక్రమం నత్తనడకగా కొనసాగుతుందన్న సమాచారంతో, తనే స్వయంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని గ్రేటర్ నేతలకు చెప్పారట కేటీఆర్. నియోజకవర్గాల వారిగా వివరాలు సేకరించిన కేటీఆర్, సంబంధిత నాయకులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారట.

దీనికి తోడు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, మేయర్ అభ్యర్థులను కూడా నగర నాయకులే ఎవరికీ వారు డిసైడ్ చేసుకుని, ఇప్పటి నుంచే గ్రూపులు కడుతున్నట్టు తెలుస్తోంది. ఎవరికి వారే యమునాతీరే అంటూ వ్యవహరించడం పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో నేతల మధ్య సమన్వయం కుదిర్చే పనిలో ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

మొత్తానికి పార్టీ పెద్దలు సమావేశం నిర్వహించిన ప్రతిసారీ, మేమంతా ఒకే లైన్‌లో ఉన్నామంటూ పైకి చెపుతున్న గ్రేటర్ నాయకులు, లోలోపల మాకు మేమే, మీకు మీరే అన్నట్టు వ్యవహరించిండాన్ని పార్టీ సీరియస్‌గానే గమనిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైతే అధినేత కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సీనియర్ నేతలే చర్చించుకుంటున్నారు.

Full View

Tags:    

Similar News