జీవన్ రెడ్డిని టీఆర్ఎస్ అందుకే టార్గెట్ చేసిందా?
ఎమ్మెల్యేగా ఓడిపోయినా, ఎమ్మెల్సీగా గెలిచి మళ్లీ తన వాగ్ధాటిని కొనసాగిస్తున్నారాయన. ఏకంగా గులాబీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, టీఆర్ఎస్‌కు పెద్ద తలనొప్పిలా తయారయ్యారు.
ఎమ్మెల్యేగా ఓడిపోయినా, ఎమ్మెల్సీగా గెలిచి మళ్లీ తన వాగ్ధాటిని కొనసాగిస్తున్నారాయన. ఏకంగా గులాబీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, టీఆర్ఎస్‌కు పెద్ద తలనొప్పిలా తయారయ్యారు. అయితే తనను టార్గెట్ చేసుకున్న, ఆ నేతనే లక్ష్యంగా చేసుకుంది గులాబీదళం. పదునైన అస్త్రాలు సంధించేందుకు సిద్దమవుతోందట.
తాటిపర్తి జీవన్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని నేతగా దూసుకుపోయిన లీడర్. అయితే ఇప్పుడాయన టీఆర్‌ఎస్‌కు కొరకురాని కొయ్యలా మారారు. మొన్నటి వరకు జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ఒకటంటే, ఒకటి జగిత్యాల నుంచి కాంగ్రెస్ గెలవడంతో, జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలోనూ జీవన్ రెడ్డితో ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రత్యర్థి పార్టీకి. అయితే టిఆర్ఎస్ పార్టీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిలీఫ్ వచ్చింది అని అనుకున్నారు అంతా. అదే జీవన్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నిక కావడం, కేవలం టార్గెట్ టిఆర్ఎస్‌గా ప్రెస్‌మీట్లతో చెలరేగిపోవడంతో, టీఆర్ఎస్ పార్టీకి జీవన్ రెడ్డి, కంట్లో నలతలా తయారయ్యారని తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జీవన్ రెడ్డి వర్సెస్ కవితగా జోరుగా రాజకీయాలు రంజుమీద సాగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమిపాలు కావడంతో, పార్లమెంటు ఎన్నికల సమయంలో జీవన్ రెడ్డి బిజెపికి అనుకూలంగా కవితను ఓడించేందుకు పని చేశారన్న చర్చ కూడా పెద్దఎత్తున టిఆర్ఎస్‌లో ఉంది. అందుకే ఇప్పుడు జీవన్ రెడ్డి టార్గెట్‌గా జగిత్యాల జిల్లాలో ఆయుధాలకు పదును పెడుతోందట టిఆర్ఎస్. ముఖ్యంగా జీవన్ రెడ్డిని రాజకీయంగా కూకటివేళ్ళతో సహా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో టిఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ జగిత్యాల మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురవేయలన్న అజెండాతో వ్యూహ రచన చేస్తోంది టిఆర్ఎస్.
జగిత్యాల మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో తన సమీప బంధువును చైర్మన్‌గా చేశారు జీవన్ రెడ్డి. టిఆర్ఎస్ జగిత్యాల మున్సిపాలిటీకి ఎన్ని నిధులు ఇచ్చినా ఖర్చు చేసి అభివృద్ధి పరిచేందుకు జీవన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, గతంలో టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసింది. జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డికి బలంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌ని, టిఆర్ఎస్‌లోకి చేర్పించుకుంది. దీంతో పాటు ఈసారి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తే, కాంగ్రెస్‌కి కీలకంగా ఉన్న జీవన్ రెడ్డిని, రాజకీయంగా దెబ్బ కొట్టొచ్చన్నది గులాబీ తాజా స్ట్రాటజీ. ఈ వ్యూహంతోనే జీవన్ రెడ్డి ఇలాకాలో టిఆర్ఎస్ తన వ్యూహానికి పదును పెడుతూ మున్సిపాలిటీపై జెండాను ఎగురవేయాలని చూస్తోంది.
మొదటి నుంచి ఈ వ్యూహాన్ని అమలు పరుస్తూనే ఉన్నా, మరోవైపు జీవన్ రెడ్డి తన రాజకీయ అనుభవం, చతురతతో టిఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఎలాగైనా జీవన్ రెడ్డిని దెబ్బకొట్టాలని ఆలోచిస్తోంది గులాబీదళం. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా, జీవన్ రెడ్డిపై గురిపెట్టారని, టీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. చూడాలి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ జీవన్ రెడ్డిగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో చివరికి ఎవరు పైచేయి సాధిస్తారో.