గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త సమస్య వచ్చిపడింది. పార్టీ అధిష్టానం ఆదేశాలు అమలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు ప్రజాప్రతినిధులు. ఇక ఉత్తర తెలంగాణకి చెందిన ఓ మంత్రికి, ఈ టాస్క్ మానిటరింగ్ అప్పగించడంతో, ఆ మినిస్టర్ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారట. కక్కలేక మింగలేక, ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైందట ఎమ్మెల్యేల పరిస్థితి. ఇంతకీ ఎమ్మెల్యేలకు ఇంతగా షివరింగ్ తెప్పిస్తున్న గులాబీ బాస్ అప్పగించిన టాస్క్ ఏంటి?
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్ అప్పగించారు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మీరు ఈ పని తప్పకుండా చేయాల్సిందేనని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రికి, ఈ మొత్తం వ్యవహారాన్ని అప్పగించారట. మంత్రి పదవి చేపట్టిన తర్వాత, బాస్ అప్పగించిన తొలి టాస్క్ కావడంతో, చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారట మంత్రి. దీంతో ఎమ్మెల్యేలను నిద్రపోనివ్వడం లేదట. ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ గా జరపాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారట ఆ మంత్రి. పార్టీ ఆదేశించిన పని చేయలేక తిప్పలు పడుతున్నారట గులాబీ నేతలు. ఎమ్మేల్యేలుగా ఉన్న తమతో ఆపరేషన్ ఆకర్ష్ చేయించడం పార్టీకే మంచిది కాదని లబోదిబోమంటున్నారట.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నడుస్తోంది. దీంతో ప్రయాణానికి బస్సుల్లేక నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చాలా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు. అటు కార్మిక కుటుంబాలు, ఇటు జనాలు సైతం, ప్రభుత్వంపైన ఆగ్రహంగా ఉన్నారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే వణికిపోతున్నారని టీఆర్ఎస్ భవన్‌లో మాట్లాడుకుంటున్నారు. ప్రజల్లో టిఆర్ఎస్‌పై అసమ్మతి పెరుగుతోందన్న నివేదికలు అధినేత చేతికి అందాయి. దీంతో సమ్మెను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారట గులాబీ నేతలు. ఆర్టీసి కార్మికులతో మాట్లాడి వారిని డిపోలకు పంపే పనిలో పడ్డారట. ఇదే ఎమ్మెల్యేలకు గులాబీ అధినేత అప్పగించిన టాస్క్. అంటే స్థానికంగా డిపోల యూనియన్ నాయకులను మాట్లాడి సమ్మె విరణమకు ఒప్పించడం, డ్యూటీలో చేరేలా చెయ్యడం, ఇదే వారి టాస్క్. అయితే, సమ్మె ఉధృతంగా సాగుతున్న సమయంలో, అసలు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టడానికే ఎమ్మెల్యేలు జంకుతున్న నేపథ్యంలో, గులాబీ బాస్ అప్పగించిన టాస్క్‌తో అల్లాడిపోతున్నారట ప్రజాప్రతినిధులు.
స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఆర్టీసి నేతలతో మాట్లాడి సమ్మెను విరమించుకోనే విధంగా చేయాలని పార్టీ అధినేత ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు అందరితోనూ రోజూ మాట్లాడి వారితో పని చేయించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రికి అప్పగించారట.
కరీంనగర్‌కి చెందిన ఆ మంత్రి, నిత్యం తన చాంబర్‌లో కూర్చుని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారట. ఉద్యోగంలో చేరాలని చూస్తున్న కార్మికులను డిపోలకు పంపి బస్సులు నడిపేలా చూడాలని ఆ మంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నారట. కానీ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్టీసీ కార్మికులు మాత్రం వినడం లేదట. ఇంకా కొందరు కార్మికులు అయితే ఎమ్మెల్యేలు అప్రోచయితే, చివాట్లు కూడా పెట్టారని చర్చ నడుస్తోంది. ఉద్యమం, ఎన్నికల్లో సహకరించామని, కానీ కష్టకాలంలో పట్టించుకోవడం లేదని, ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకే, రివర్స్ క్లాస్ ఇస్తున్నారట కార్మిక సంఘాల నాయకులు. దీంతో తాము ఈ పని చెయ్యలేం బాబోయ్ అంటూ, చేతులెత్తేస్తున్నారట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. తమ అసహాయతను అధిష్టానానికి చెప్పుకోలేక, ఇటు కార్మికులను సముదాయించలేక తలలు పట్టుకొంటున్నారట. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తమ పరిస్థితి తయారైందని సతమతమవుతున్నారట గులాబీ ఎమ్మెల్యేలు.
సమ్మెను నిర్వీర్యం చేసేందుకు, కార్మిక సంఘాలను విభజించు పాలించు అన్నట్టుగా రకరకాల వ్యూహాలు రచిస్తున్నా, చివరికి స్థానిక ఎమ్మెల్యేలను రంగంలోకి దింపినా, ఫలితం ఉండటం లేదని మథనపడుతోందట టీఆర్ఎస్ అధిష్టానం. ఏకంగా మంత్రి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినా ఫలితం మాత్రం ఉండటం లేదట. ఎమ్మెల్యేలపై మంత్రి ఒత్తిడి పెంచినా పనయ్యేలా లేదని దాదాపు డిసైడయ్యారట. మరి బాస్ అప్పగించిన టార్గెట్ ను కరీంనగర్ జిల్లా మంత్రి ఎలా రీచ్ అవతారో చూడాలి.