బాన్సువాడలో సన్‌స్ట్రోకా..సన్‌రైజా?

Update: 2020-01-20 07:21 GMT
బాన్సువాడలో సన్‌స్ట్రోకా..సన్‌రైజా?

ఆ మున్సిపాల్టీ ఎన్నికలు, ఆ సీనియర్‌ నాయకుడి కుటుంబానికి కీలకంగా మారాయా? అందుకే తన కుమారులను రంగంలోకి దింపారా? బాన్సువాడ బస్తీ పోరు, ఆ‍యనలో ఎందుకంత అలజడి రేపుతోంది?

కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన బాన్సువాడ మున్సిపాలిటిలో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎన్నికలకు ముందే బాన్సువాడలో ఓ వార్డును ఏకగ్రీవం చేసి అధికార పార్టీ బోణి కొట్టింది. పట్టణంలో మొత్తం 19వార్డులు ఉండగా 20వేల మంది ఓటర్లు ఉన్నారు. బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండే పట్టణంలో ఆ ఓటర్లు ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతారో ఆ పార్టీ విజయం సాధిస్తుంది. రెండు సామాజికవర్గాలు ఎటు వైపు మొగ్గు చూపితే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఇంతకు ముందు కేవలం కామారెడ్డి మున్సిపాలిటి మాత్రమే ఉండేది. తాజాగా ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటిలు ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పడిన తర్వాత తొలిసారి బాన్సువాడ మున్సిపాలిటి ఎన్నిక జరుగుతువుండటంతో రెండు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కాసుల బాలరాజుకు, ఇటు టిఆర్ఎస్ నుంచి పోచారం కుటుంబానికి చైర్మన్ పీఠంను దక్కించుకోవడం ప్రతిష్టత్మకంగా మారాయి.

ఎలాగైనా బాన్సువాడ మున్సిపాలిటిపై గులాబి జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యూహారచన చేస్తున్నారు. ఇక్కడ పార్టీ గెలుపు స్పీకర్‌కు ఎంతో కీలకమనే చెప్పాలి ఏ మాత్రం తేడా వచ్చిన రాజకీయంగా వారి కుటుంబానికి మైనస్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఈ ఎన్నికను పోచారం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తన ఇద్దరు కొడుకులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలను రంగంలోకి దింపి చైర్మన్ పీఠంను దక్కించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సైతం బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుకు మోజార్టీ వచ్చింది పోచారంపై కాసుల బలరాజు ఓడిన బాన్సువాడ టౌన్‌లో, కాంగ్రెస్‌కు లీడ్ రావడం టిఆర్ఎస్‌ను కలవరానికి గురిచేస్తోంది. అయితే మళ్లీ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు లీడ్ తీసుకొచ్చినా బాన్సువాడ పట్టణ ఓటర్ల నాడి ఎలా ఉంటుందో తెలియక హైరానా పడుతున్నారు. రాజకీయంగా కీలకంగా మారడంతో బాన్సువాడ మున్సిపాలిటీ గెలుపు బాధ్యతలు తీసుకున్న పోచారం తనయులు అభ్యర్ధుల ఎంపిక నుంచి ప్రచార బాధ్యతల వరకు అన్ని తామై వ్యవహారిస్తున్నారు. తొలి పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామనే ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ సైతం బాన్సువాడపై ఫోకస్ పెట్టింది. చూడాలి, బాన్సువాడ మున్సిపాలిటీని గెలిచి, తండ్రికి తనయులు గిఫ్టుగా ఇస్తారో, లేదంటే చేతులెత్తేస్తారో.


Full View


Tags:    

Similar News