TRS - BJP: తెలంగాణలో గులాబీ Vs కమలం
* టీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు * శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్ ధర్నాలు
TRS - BJP: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై వివాదం ముదురుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటి నిరసనలు, ధర్నాలతో రాజకీయం వేడెక్కొంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ధర్నాకు దిగుతుంటే, మరోవైపు దీనికి పోటీగా బీజేపీ కూడా నిరసనలకు రెడీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టరేట్ల వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది.
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
అయితే టీఆర్ఎస్‌కు కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ధర్నాకు ఒకరోజు ముందుగానే బీజేపీ ధర్నాలకు ప్లాన్ చేసింది. ఇవాళ అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
టీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రైతుల విషయంలో ఇరు పార్టీలు తమ వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆందోళనబాట పట్టాయి. అయితే టీఆర్‌ఎస్, బీజేపీలు చేస్తున్న వాదనలో ఏది నిజమో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంతాలు మాని ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.