Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ మళ్లింపు
* ఇవాళ నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి ట్రాఫిక్ మళ్లింపు.. ప్రత్యామ్నాయ మార్గాలపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి
Hyderabad: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు రహదారులపై రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం చేపట్టారు. ఇది ఇవాల్టీ నుంచి అమలులోకి రానుంది. ట్రాఫిక్ మళ్లింపును వాహనదారులు సహకరించాలని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ కోరారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, CVR చౌరస్తా, రోడ్ నంబర్ 36 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపుపై జాయింట్ కమిషనర్ రంగనాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్‌లకు వెళ్లేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా వెళ్తున్నారు. KBR పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా రోడ్ నంబర్ 45 వద్ద కుడివైపునకు తిరిగి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్లడానికి వేలాదిగా వాహనాలు వస్తుండటంతో ఈ ప్రాంతాలన్నీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోతున్నాయన్నాయి. దీంతో సమీపంలోని జర్నలిస్ట్ కాలనీ జంక్షన్, CVR జంక్షన్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోందని రంగానాథ్ తెలిపారు.
జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఒక్కో సిగ్నల్ దాటేందుకు సుమారు 15 నిమిషాలు పడుతోందని, ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా కొన్ని మార్గాలను ఎంచుకుని ప్రయోగాత్మకంగా ఈరోజు నుంచి కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.