కొత్తపులుల అలజడి.. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అడవుల్లో సంచారం
* పొలాల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని స్థానికులకు సూచన
Tigers Alert: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కదలికలు మళ్లీ అలజడి రేపుతున్నాయి. ఇటీవల ఐదారు పులుల సంచారం పెరగడంతో సరిహద్దు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలోని ఓ పత్తి చేనులో పులి ఒకరిని చంపి కిలోమీటర్ దాకా ఈడ్చూకెళ్లిన ఉదంతంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అదిగాక తరుచుగా జనావాసాలకు దగ్గరగా పులి కదులుతూ, రోడ్డు దాటుతూ కనిపిస్తుండటంతో ప్రజల్లో భయం మరింతగా పెరిగింది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ నుంచి ఆదిలాబాద్ అడవి పరిధిలోకి ఒకపెద్దపులి ఏడాదిన్నర వయసున్న మూడు పులిపిల్లలు, వాంఖిడి నుంచి ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలోకి మరో మగ పులి కొత్తగా ప్రవేశించాయి.
వాంఖిడి నుంచి వచ్చిన పులి కాగజ్ నగర్ అడవిలో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు యత్నించింది. అయితే ఇప్పటికే అక్కడ స్థిర పడిన మరో మగపులి దానిని తరిమివేసిందని అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ పులి కాగజ్ నగర్ అడవీ నుంచి బయటకు వచ్చాక ఆసిఫాబాద్ లో ఒకరిపై దాడి చేసింది. ఈ తర్వాత అది ఆసిఫాబాద్‌లో ఒకరిపై దాడి చేసింది.
ఆ తరువాత పులి ఈద్ గామ్ గ్రామం నుంచి ప్రస్తుతం బెజ్జార్ మండలంలోని మరేపల్లి, కాటేపల్లి గ్రామాలకు సమీపంలో సంచరిస్తుండటం సమస్యగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న పులులతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు పెరగడంతో ఈ సమస్య తీవ్రమైంది. ఏటా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా సరిహద్దుల నుంచి తెలంగాణలోకి పులులు రాకపోకలు సాగిస్తుండటం మామూలేనని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఒకేసారి రెండు, మూడు ప్రాంతాల్లో ఐదారు పులులు సంచరిస్తుండటంతో..ప్రజల్లో మరింత అవగాహన ఎక్కువైందని అంటున్నారు. అయితే, ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.