Telangana Economy: వేల కోట్లు వడ్డీలకే పోతున్నాయి... ఇక అసలు తీర్చేదెన్నడు?

తెలంగాణ 2014 జూన్ 2న ఏర్పడినప్పుడు ఉన్న అప్పు రూ. 72, 658 కోట్లు. పదేళ్లలో అప్పులు పది రెట్లు పెరిగి 6.71 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. 2023 డిసెంబర్ లో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు.

Update: 2024-07-22 13:45 GMT

Telangana Economy: వేల కోట్లు వడ్డీలకే పోతున్నాయి... ఇక అసలు తీర్చేదెన్నడు?

రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలల్లో 25,118 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా బీఆర్ఎస్ మార్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తొమ్మిదిన్నర ఏళ్లు పాలించిన కేసీఆర్ తమకు 7 లక్షల కోట్ల లోటుతో ఖజానాను అప్పగించారని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ రోజుకు సగటున రూ. 207 కోట్లను ఖర్చు చేస్తోందని, ఖజానా ఖాళీ కావడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీల అమలుకు వనరులు సమీకరించాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.



 తెలంగాణలో అప్పులెన్ని?

తెలంగాణ 2014 జూన్ 2న ఏర్పడినప్పుడు ఉన్న అప్పు రూ. 72, 658 కోట్లు. పదేళ్లలో అప్పులు పది రెట్లు పెరిగి 6.71 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. 2023 డిసెంబర్ లో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ప్రజలకు వివరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో 24.3 శాతం చొప్పున రుణాలు పెరిగాయని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

2015-16 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర రుణభారం జీఎస్ డీపీలో 15.7 శాతంగా ఉంది. అప్పట్లో దేశంలోనే ఇది అత్యల్పం. అయితే ఇది 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగింది. ప్రభుత్వ హమీతో 17 స్పెషల్ పర్సస్ వెహికిల్స్ ను ఏర్పాటు చేసి రూ. 1,85,029 కోట్లు సేకరించారు. ప్రభుత్వ హమీ లేని రుణాలను కలిపితే రాష్ట్రం అప్పులు రూ. 6,71,757 కి చేరాయి. 2014-15లో అసలు, వడ్డీ చెల్లింపులు రూ.7,255 కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పులు 2023-24 నాటికి రూ.53,978 కోట్లకు చేరినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

గతంలో మొత్తం ఆదాయంలో చెల్లింపులకు 14 శాతం పోగా, ఇప్పుడు 34 శాతానికి పెరిగాయి. అప్పులు తెచ్చి రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, మౌళిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేసినట్టుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్ చెప్పారు. తమ ప్రభుత్వం అవలంభించిన విధానాలతోనే అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. తెచ్చిన అప్పులను ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఖర్చు చేస్తున్నామో లేదో చూడాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్దితోనే రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎఫ్‌ఆర్బీఎం లోన్లు

రూ.3,89,673 కోట్లు

ఎస్పీవీలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన రుణాలు

రూ.1,27,208 కోట్లు

ఎస్పీవీలు సొంతంగా సేకరించిన రుణాలు

రూ.95,462 కోట్లు

కార్పొరేషన్లు, సంస్థల లోన్లు

రూ.59,414 కోట్లు

మొత్తం

 రూ.6,71,757 కోట్లు



 పెరుగుతున్న వడ్డీ భారం

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అప్పులు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2014-15 లో అసలు, వడ్డీచెల్లింపులకు రూ,6,954 కోట్లు ఖర్చు చేస్తే 2023-24 నాటికి రుణ చెల్లింపు భారం రూ, 32,939 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ మొత్తం రుణాలు, వడ్డీల చెల్లింపునకు ఖర్చు చేస్తున్నారు. ఐదు కార్పోరేషన్లు తీసుకున్న అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఈ కార్పోరేషన్లకు తీసుకున్న అప్పులకు 8.93 శాతం నుండి 10.49 శాతంగా చెల్లింపులున్నాయని ప్రభుత్వం చెబుతోంది. బహిరంగ మార్కెట్ రుణాల సగటు వడ్డీ రేటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలు చేసింది.


 అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్న రేవంత్ సర్కార్

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన 2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ వరకు 25,118 కోట్ల రూపాయాలు అప్పులు తెచ్చింది. అయితే తెచ్చిన అప్పుల కంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలకు రూ.38,040 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా రూ. 7,718 కోట్లను అప్పులు తెచ్చారు. అయితే అదే నెలలో రూ. 8,458 కోట్లను వడ్డీల కింద చెల్లించారు.

2023 డిసెంబర్ లో రూ.1,400 కోట్లు అప్పులు తెచ్చారు. 2024 జూన్ లో రూ. 2 వేల కోట్లు అప్పులు తెచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల వడ్డీలకే ఎక్కువగా అప్పులు చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. 2024 మార్చిలో అత్యధికంగా రూ.8,458 కోట్లను అప్పులకు వడ్డీలుగా చెల్లించారు. 2024 జూన్ లో అత్యల్పంగా రూ. 1,785 కోట్లు చెల్లించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల్లో చేసిన అప్పులు... కట్టిన వడ్డీలు

నెల 

 అప్పులు

అప్పులకు వడ్డీల చెల్లింపులు

డిసెంబర్, 2023

రూ.1400 కోట్లు

 రూ.4,754 కోట్లు

జనవరి, 2024

రూ.3000 కోట్లు

రూ.6,459 కోట్లు

ఫిబ్రవరి, 2024 

రూ. 3,000 కోట్లు

రూ. 4,648 కోట్లు

మార్చి , 2024

రూ. 7,718 కోట్లు

రూ. 8,458 కోట్లు

ఏప్రిల్ , 2024

రూ.4,000 కోట్లు

రూ. 4,450 కోట్లు

మే, 2024 రూ

4,000 కోట్లు

రూ.7,487 కోట్లు

జూన్, 2024 

రూ.2,000 కోట్లు

రూ. 1,785 కోట్లు



కాళేశ్వరం కార్పొరేషన్‌ అప్పు రూ.72,067 కోట్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై 2022 మార్చి నాటికి రూ.86,788 కోట్లను ఖర్చు చేశారు. అందులో కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణం రూ.55,808 కోట్లు. 2021-22లో కార్పొరేషన్‌కు అసలు, వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.1,422 కోట్లను అప్పుల కింద చెల్లించింది. పెట్టుబడుల కింద మరో రూ.3,072 కోట్లను ప్రభుత్వం అందజేసిందని గణాంకాలు తెలిపాయి.

కాళేశ్వరం కార్పొరేషన్‌ పేరుతో ప్రభుత్వమే రూ.1,41,544 కోట్లను 14 ఏళ్లలో చెల్లించాల్సి ఉంది. నీటిని లిఫ్ట్ చేయడానికి అవసరమైన విద్యుత్ చార్జీల కోసం ఏడాదికి రూ.10,375 కోట్ల చొప్పున 12 ఏళ్లలో రూ.1,24,495 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన అంశం వెలుగులోకి రావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రజా ధనాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా వృధా చేసిందో అర్ధమౌతుందని రేవంత్ రెడ్డి సర్కార్ విమర్శలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చుపై కాగ్ నివేదిక కూడా తప్పు బట్టింది. 2023-24 నుంచి 2032-33 నాటికి పదేళ్లలో కాళేశ్వరం అప్పులు రూ,2,31,782 కోట్లను చెల్లించాలని కాగ్‌ తెలిపింది. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు మరో రూ.20,266 కోట్లను చెల్లించాలని ఆ రిపోర్ట్ చెబుతుంది. 2017-18లో రూ.10,836 కోట్లుగా ఉన్న వడ్డీ భారం 2021-22 నాటికి రెట్టింపు అయిందని కాగ్ తన నివేదికలో వివరించింది.


 తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు రూ. 81 వేల 516 కోట్లు

విద్యుత్ సంస్థల అప్పులు తెలంగాణలో రూ. 81, 516 కోట్లకు చేరాయి. డిస్కంల అప్పులు 62, 461 కోట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. డిస్కంలకు పలు ప్రభుత్వ శాఖల నుండి రూ. 28,842 కోట్ల బకాయిలు చెల్లించాలి. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ జెన్ కో అప్పులు రూ.7,662 కోట్లుంది. అయితే 2023 డిసెంబర్ నాటికి రూ. 32, 797 కోట్లకు చేరాయి.

మరో వైపు రూ. 14, 631 కోట్లు ఇతర అవసరాల కోసం చేశారు. వీటిని కలిపితే జెన్ కో అప్పులు రూ. 53 వేల కోట్లకు చేరాయి. తెలంగాణ ట్రాన్స్ కో ఏర్పడే నాటికి రూ. 2, 411 కోట్ల అప్పులున్నాయి. గత పదేళ్లలో ఈ అప్పులు రూ. 10, 529 కోట్లకు చేరాయి. 2014 నాటికి విద్యుత్ శాఖకు ప్రభుత్వ శాఖల నుండి రూ. 1,595.37 కోట్ల బకాయిలు రావాలి. 2023 నాటికి ఈ బకాయిలు రూ. 28,842 కోట్లకు చేరాయి. రాజకీయ అవసరాల కోసం పార్టీలు ఇచ్చిన హమీలు కూడ పరోక్షంగా ఆయా సంస్థలు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

జీత భత్యాలు, పెన్షన్లకు నెలకు రూ. 55 వేల కోట్లు

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రతి నెల రూ. 55,752 కోట్లు అవసరం. అంతకుముందు ఇది రూ.51,651 కోట్లుగా ఉండేది. రేవంత్ ప్రభుత్వం పెన్షన్లను పెంచింది. దీంతో సుమారు రూ. 4 వేల కోట్ల భారం పడింది. పెన్షన్లపై భారం 29 శాతం అదనంగా పెరిగింది.

2024 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ. 13,703.92 కోట్ల ఆదాయం వచ్చింది. 2023 నవంబర్ లో రూ.9,701 కోట్లు మాత్రమే వచ్చింది. పెట్రోల్, డీజిల్, మద్యంపై వసూలు చేసే అమ్మకపు పన్ను కింద రూ. 39,500 కోట్లు వస్తుందని అంచనా వేస్తే రూ. 29,989.55 కోట్లే వచ్చాయి. మద్యంపై ఎక్సైజ్ సుంకం రూ. 19,884.90 కోట్లు అంచనా వేస్తే.. రూ. 20,298.89 కోట్లు వసూలయ్యాయి.


 కాగ్ నివేదిక ఏం చెప్పిందంటే ?

కాగ్ నివేదిక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తప్పుబట్టింది. ఎఫ్ఆర్బీఎంకు మించి అప్పులు చేసినట్టుగా కాగ్ నివేదిక తెలిపింది. రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి సర్కార్ కాగ్ నివేదికను సమర్పించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 11, 48, 115 కోట్లలో అప్పుల వాటా 37.77 శాతంగా కాగ్ తెలిపింది. ఇది ఎఫ్ ఆర్ బీ ఎం విధించిన 25 శాతం పరిమితిని అతిక్రమించినట్టేనని ఆ రిపోర్ట్ తెలిపింది.

15వ ఆర్ధిక సంఘం ఇచ్చిన 29. 30 శాతం వెసులుబాటు కన్నా ఇది ఎక్కువేనని ఆ నివేదిక వెల్లడిస్తుంది. పింఛన్ల కింద రూ.5046 కోట్లు, దళిత బంధు కింద రూ.3,442 కోట్లు, కుటుంబ పింఛన్ల కింద రూ.1,929 కోట్లు, రాష్ట్ర అభివృద్ధి రుణాల వడ్డీ కింద రూ.1,785 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధిక వ్యయాలుగా కాగ్‌ తప్పు పట్టింది. కేటాయింపుల కంటే తక్కువ వ్యయం చేసిన విషయాన్ని కాగ్ గుర్తించింది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలకు బడ్జెట్ లో కేటాయింపుల కంటే తక్కువగా ఖర్చు చేసినట్టుగా కాగ్ తెలిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచడంతో జీతాల భారం పెరిగిందని కాగ్ అభిప్రాయపడింది. విద్య, వైద్యం వంటి రంగాలపై ప్రభుత్వ వ్యయం గత కొన్నేళ్లుగా తక్కువగా ఉందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.


 ప్రభుత్వాలు అప్పులు ఎందుకు చేస్తున్నాయి…

రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అప్పులు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలుకు నిధులు అవసరం. ప్రత్యర్ధి పార్టీల కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోవడం కోసం ఆచరణ సాధ్యం కానీ హమీలను పార్టీలు చేస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త ప్రభుత్వానికి వారసత్వంగా పాత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా తీర్చాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో రాష్ట్రాలు ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితిని మించి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అప్పులు చేసే సమయంలో ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఆలోచించాలి. అంతేకాదు ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు హరగోపాల్ సూచించారు. అప్పులు ఇచ్చే సమయంలో ఆయా సంస్థలు కూడా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

అధికారం శాశ్వతమనే భావనలో పాలకులు తీసుకొనే నిర్ణయాలు సంక్షోభాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే ఫలితాలు మరో రకంగా ఉంటాయని, ఇలా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోయాల్సిన అవసరం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News