Telangana: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతి నాలుగు వారాల్లో తేల్చాలన్న హైకోర్టు... స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

Telangana: బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.

Update: 2024-09-09 13:52 GMT

Telangana High Court

Telangana: బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నాలుగు వారాల్లో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకొని విచారణ చేస్తామని కూడా ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేశారు?
బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఫిర్యాదులను తీసుకోవడం లేదంటూ హైకోర్టులో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది.

స్పీకర్ ముందున్న మార్గాలు ఏంటి?
హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. లేదా హైకోర్టు తీర్పు మేరకు నడచుకోవాలంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఈ నోటీసులపై ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వాలి. ఈ సమాధానంపై స్పీకర్ వారిని విచారించాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ కు విచక్షణ అధికారం ఉంది.

అయితే మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇదే స్పీకర్ కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు తీర్పు మేరకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిస్తారా? లేదా అప్పీల్ కు వెళ్తారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది.

బీఆర్ఎస్ వాదన ఏంటి?
ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ గెలిచారు. అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచిన కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటు కాంగ్రెస్ లో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి మరో పార్టీ బీ ఫారంపై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటేయాలని ఆ పార్టీ కోరుతుంది.

కడియం శ్రీహరి తన కూతురు కావ్య గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్ధి తరపున తెల్లం వెంకట్రావు ప్రచారం చేశారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ లో చేరిన మిగిలిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ నాయకులు కోరుతున్నారు.

హైకోర్టు తీర్పుని స్వాగతించిన కాంగ్రెస్
హైకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్వాగతించారు. ఈ తీర్పుపై స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ లో చేరారని.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ లో నెలకున్న సంక్షోభం నేపథ్యంలోనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని దయాకర్ చెప్పారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల పై స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపనుంది. హైకోర్టు ఇచ్చిన సమయం లోపుగా అధికార పార్టీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వస్తుందో... దానికి బీఆర్ఎస్ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News