Telangana: వనపర్తిలోని చారిత్రాత్మక మెట్లబావికి పూర్వ వైభవం

Telangana: చెత్తా, చెదారాన్ని తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది, గ్రీన్ టీం సభ్యులు

Update: 2022-12-21 02:44 GMT

Telangana: వనపర్తిలోని చారిత్రాత్మక మెట్లబావికి పూర్వ వైభవం 

Telangana: తెలంగాణలో అలనాటి మెట్లబావులకు పూర్వ వైభవం లభిస్తోంది. సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో ఉన్న శతాబ్దాల క్రితంనాటి మెట్లబావికి మంత్రి కేటీఆర్ చొరవతో పూర్వ వైభవం లభించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజుల కాలం నాటి మెట్లబావులు, వారసత్వ సంపద సంరక్షణ అంశం తెరపైకి వస్తోంది. ఆయా ప్రాంతాల్లోని సంస్థానాదీశుల కాలం నాటి బావులు, కొలనుల సంరక్షణపై ఆయా ప్రాంతాల్లోని అధికారులు, పాలకులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజమహల్ ఆవరణలో గల గరుడ పుష్కరిణిగా పిలువబడే మెట్లబావికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గ్రీన్‍ టీమ్‍ అనే స్వచ్చంద సంస్థ నడుం బిగించింది. కొంతమంది దాతల సహకారంతో మెట్లభావికి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు గ్రీన్‌ టీం సంస్థ సభ్యులు.

మెట్లబావిలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెలికి తీసి బావిని శోభాయమానంగా తీర్చిదిద్దే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు గ్రీన్‍ టీమ్‍ సభ్యులతో పాటు మున్సిపల్‍ సిబ్బంది, పట్టణ వాసులు కూడా చేయి కలపడంతో మెట్లబావి త్వరలోనే పూర్వవైభవం సంతరించుకోబోతోంది. వనపర్తి సంస్థానాన్ని భారత్ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత చివరి రాజైన రాజా రామేశ్వరరావు రాజమహల్ని పాలిటెక్నిక్ కాలేజీకి అప్పగించారు. అప్పటి నుంచి సరైన పర్యవేక్షణ లేక దశాబ్దాలుగా సంస్థానాధీశులు జలకాలాడిన గరుడ పుష్కరిణి ఇలా అధ్వానంగా మారింది. అయితే ఇన్నాళ్ళు నిరుపయోగంగా ఉన్న ఈ మెట్ల బావిని శుభ్రం చేస్తుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.

వారసత్వ సంపదను కాపాడుకోవాలనే లక్ష్యంతో గ్రీన్ టీమ్ బృందం సభ్యులు చేసే ప్రయత్నానికి అధికారులు కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇటు కళాశాల విద్యార్థులు, పట్టణ ప్రజలు సైతం గ్రీన్‍ టీం సభ్యులకు సహకారం అందిస్తుండటంతో వనపర్తిలోని మెట్లబావికి కొద్ది రోజుల్లోనే పూర్వవైభవం సంతరించుకోనుంది. మెట్లబావికి పూర్వవైభవం తీసుకొస్తున్న గ్రీన్‌ టీం స్వచ్ఛంద సంస్థ సభ్యులకు జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. 

Tags:    

Similar News