జగదాంబికా అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభం

శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపు

Update: 2024-07-07 12:00 GMT

జగదాంబికా అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభం

 శివసత్తుల పూనకాలు... పోతరాజుల విన్యాసాలు... ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు... నెత్తిన బోనం ఎత్తుకుని తరలివచ్చిన మహిళలతో గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా పూర్తి అయ్యాయి. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలంగా మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ప్రాంతమంతా మార్మోగింది. శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. లంగరౌ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోటాబజార్‌లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు సమర్పించారు.

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మళ్లీ గోల్కొండలోనే చివరి బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇక మధ్యలో ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం బోనాల ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News