ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత... హైడ్రా చేసిన పని కరెక్టేనా? నాగార్జున వెర్షన్ ఏంటి?
N Convention Center Demolition: హైద్రాబాద్ మాదాపూర్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. ఇక్కడ ఉన్న తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి.
N Convention Center Demolition: టాలీవుడ్ నటులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారనే ఫిర్యాదుల ఆధారంగా దీన్ని కూల్చారు. భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు గంటల వ్యవధిలో ఈ కన్వెనన్ ను నేలమట్టం చేశారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై వచ్చిన ఆరోపణలు ఏంటి?
హైద్రాబాద్ మాదాపూర్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. ఇక్కడ ఉన్న తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. 2015 ఆగస్టు 20 నుండి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తైంది. ప్రముఖలకు చెందిన ఫంక్షన్లు, సినిమా ఈవెంట్లు ఎక్కువగా ఈ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతాయి. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల చెరువును ఆక్రమించి నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.
తుమ్మిడికుంట చెరువు 20.24 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో నిర్మించారు. రెండు ఎకరాలు బఫర్ జోన్, 1.12 ఎకరాలను ఎఫ్ టీ ఎల్ లెవల్లో నిర్మించారని ఇరిగేషన్,జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా 2014 సెప్టెంబర్ మాసంలో నిర్వహించిన సర్వే నిర్ధారించింది. అయితే ఈ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు నోటీసులిచ్చింది. ఈ నోటీసులపై ఆ సంస్థ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. కోర్టు స్టే ఇచ్చింది. దీంతో కూల్చివేతలు నిలిచిపోయాయి.
బఫర్ జోన్ అంటే ఏంటి? నిర్మాణాలు చేయవచ్చా?
వాగు, కాలువ, చెరువు 10 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంటే దానికి 9 మీటర్ల దూరం తర్వాతే భవనాల నిర్మాణానికి అనుమతివ్వాలి. 10 మీటర్ల కంటే వెడల్పుతో ప్రవహించే నీటి వనరులకు 30 మీటర్ల దూరం తర్వాతే భవన నిర్మాణాలకు అనుమతివ్వాలని పంచాయితీ, మున్సిపల్ చట్టాలు చెబుతున్నాయి. చెరువు లేదా ఏదైనా జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్ధ్యం పరిధిని ఫుల్ ట్యాంక్ లెవల్ అంటారు. కొన్ని దశాబ్దాలుగా వచ్చిన వరద ఆధారంగా ఎఫ్ టీ ఎల్ ను నిర్ధారిస్తారు. ఇక నీటి వనరులను బట్టి బఫర్ జోన్ ను నిర్ధారిస్తారు. బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దు.
కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది?
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత గురుకుల్ ట్రస్టు భూముల్లో నిర్మాణాలను కూల్చింది. ఇందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ, నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు రీసర్వే కూడా చేశారు.
అయితే ఈ రీసర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. అయితే ఈ విషయమై అప్పట్లో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కారణాలు ఏంటో తెలియదు కానీ, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నిలిచిపోయింది. ప్రస్తుతం మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ విషయమై ఈ నెల 21న మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఏం చెప్పారంటే?
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై కోర్టును ఆశ్రయిస్తానని సినీ నటులు నాగార్జున చెప్పారు. స్టే ఆర్డర్ ఉన్నా, కోర్టు కేసులకు విరుద్దంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేశారని ఆయన తెలిపారు. పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినట్టుగా నాగార్జున ట్వీట్ చేశారు.
కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే తానే దగ్గరుండి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేస్తానని ఆయన చెప్పారు. చెరువు భూమిలో నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేశారని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి కూతురు ఎంగేజ్ మెంట్ కూడా ఇక్కడే
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి ఎంగేజ్ మెంట్ 2015 జూన్ 11న ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఓటుకు నోటు కేసులో జైలులో ఉన్న రేవంత్ రెడ్డి కోర్టు అనుమతితో ఈ వేడుకలో పాల్గొన్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు, ఆయన కేబినెట్ సహచరులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇటీవలే సినీనటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ కూడా ఇక్కడే జరిగింది.
చెప్పినట్టే చేసిన హైడ్రా కమిషనర్
చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి మీడియా ప్రశ్నలకు ఆయన స్పష్టత ఇచ్చారు. చట్టం అందరికీ ఒక్కటేనని ఆయన చెప్పారు. ఎన్ కన్వెన్షనే కాదు...అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కూల్చివేస్తామని ఆయన చెప్పారు. రెండు వారాల క్రితం మీడియా సమావేశంలో ఆయన చెప్పినట్టుగానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసింది.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను ఆగస్టు 24న దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇది నాగార్జునకు ఊరటనిచ్చింది.
ఆక్రమణలకు పాల్పడుతున్న వారెవరైనా వదలమని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి సర్కార్ సంకేతాలు ఇచ్చింది. హైడ్రా బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.