సాగర్ ఎడమ కాలువ వరద బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ బృందం

బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చిన మాజీ మంత్రి హరీష్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి

Update: 2024-09-03 08:58 GMT

సాగర్ ఎడమ కాలువ వరదబాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ బృందం

సాగర్ ఎడమ కాలువ వరద ప్రభావంతో.. నీట మునిగిన ప్రాంతాలను బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది. వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రులు హరీష్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్‌ రెడ్డి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను హరీష్‌ రావు పరామర్శించారు. ప్రజలు ధైర్యం కోల్పోవద్దని.. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని.. జగదీష్‌ రెడ్డి తెలిపారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజులు పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోడానికి కేసిఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఖమ్మంలో కాల్వకట్ట దెబ్బతినడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని.. బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్ట మీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గేట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు పోకుండా చేశారు. గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల కట్ట కొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు. కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాకం వల్లే తెగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

Tags:    

Similar News