Power Para Glider In Telangana : రామగుండం యువకుడి అద్భుత ఆవిష్కరణ

Update: 2020-09-23 12:31 GMT

Power Para Glider In Telangana : పారా గ్లైడింగ్ దీని గురించి వినని వారు, అలాగే దీని గురించి తెలియని వారు ఎవరూ ఉండరనుకుంటా. పర్యాటకులకు ఎంతో ఇష్టమైన సాహస క్రీడ ఇది. అయితే చాలా మందికి జీవితంలో ఒక్కసారైనా పారా గ్లైడింగ్ చేయాలని, ఆకాశంలో అలా అలా పక్షిలాగా విహరించాలని ఆశపడుతుంటారు. భూమికి వందల మీటర్ల ఎత్తులో పక్షిలా విహరిస్తుంటే ఆ కిక్కే వేరనుకుంటారు. ఆ సదుపాయం మన దగ్గర ఎక్కువగా ఉండదు. ఇలాంటి క్రీడలు పర్యాటక ప్రదేశాల్లో, పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అంటే కాశ్మీర్ రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో అన్న మాట. మన ప్రాంతాల్లో కనీసం వాటిని చూద్దాం అన్నా కంటికి కూడా కనిపించవు. అలాంటి తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఏకంగా పారా గ్లైడర్‌ను తయారు చేశాడు. అంతే కాదు అతను తయారు చేసిన పారా గ్లైడర్‌ను విజయంతంగా గాల్లోకి తీసుకెళ్లి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. తన మేధస్సును ఉపయోగించి పవర్ పారా మోటర్ గ్లైడింగ్ యంత్రాన్ని ఆవిష్కరించి విజయం సాధించాడు.

వింటుంటేనే అరెవా..మనమూ ఒక్కసారి దాన్ని చూస్తే బాగుండేది అనుకుంటున్నారు కదా. అసలు ఎవరు ఆ యువకుడు, ఎక్కడి వాడు అనుకుంటున్నారా అయితే పూర్తివివరాల్లోకెళదాం పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన ఆడెపు అర్జున్ బీకాం పూర్తి చేశాడు. అతడి తండ్రి వెంకటేశ్శర్లు సింగరేణిలో ఉద్యోగం చేసి పదవీవివరమన పొందాడు. అయితే కుటుంబంలో చిన్నవాడైన అర్జున్ ఎప్పుడూ సాహస విన్యాసాలు, సాహస క్రీడలను ఇష్టపడేవాడు. అయితే గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్టంలో చదువుకుంటున్న అర్జున్ తాను ఇష్టపడే సాహస క్రీడలపై ప్రయోగం చేసాడు. తన స్నేహితులతో కలిసి విన్యాసాలలో నైపుణ్యం పెంచుకున్నాడు. అంతే కాదండోయ్ అతను ఈ పారగ్లైడర్ తయారు చేయడానికి రిటైర్డ్ ఆర్మీ అధికారులు పైలెట్, క్రీడాకారులు, పార గ్లైడర్‌లు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో కూడా అతనికి కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు.

తెలుసుకున్న వాడు అలాగే ఉండకుండా ఆ పవర్ పార గ్లైడర్ రూపొందించాలని మూడేళ్లుగా విశ్వప్రయత్నాలు చేసాడు. అంతే కాదు అందుకు కావలసిన పనిముట్లను, యంత్రాలను అమెరికా, ఇటలీ నుండి సుమారుగా పదిహేను లక్షల విలువైన పరికరాలను తెప్పించాడు. వాటితో తానే స్వయంగా పారా గ్లైడర్‌ను తయారు చేశాడు. తాను తయారు చేసిన పారా గ్లైడర్‌తో రామగుండం జెన్కో ఏకో క్రీడా మైదానంలో సోమవారం 20 నిమిషాల పాటు ట్రైలర్ రన్ నిర్వహించి అందరినీ అబ్బుర పరిచాడు. అచ్చం సినిమాల్లో చూసినట్టుగానే గాల్లో విన్యాసాలు చేసి అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అర్జున్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ప్రోత్సహం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్ అడ్వెంచర్ కోసం ఇతర రాష్ట్రాల నుండి పారాగ్లైడర్లను పిలిపించి విన్యాసాలు చేస్తానని తనకు ఒక అవకాశం ఇవ్వాలని అర్జున్ కోరుతున్నాడు. పారా గ్లైడర్ తయారుచేసిన అర్జున్ ప్రతిభ‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News