ఒకప్పుడు కళకళలాడింది. ఇప్పుడు వెలవెలబోతోంది. సందర్శకులతో ఇప్పటికీ కిటకిటలాడుతోంది. కానీ వారి మొర వినేనాథుల్లేక నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. తెలంగాణ సచివాలయంలో, మంత్రులపై కొత్త చర్చ మొదలైంది.
తెలంగాణ మంత్రులు సెక్రెటరియట్ వైపు అసలు చూడ్డమే మానేశారు. చాలా రోజుల నుంచి మంత్రులందరూ సెక్రెటరియట్ వైపు కన్నెతైన చూడటం లేదు. సచివాలయంలోని శాఖల తరలింపు ఇంకా ప్రారంభం కాలేదు. మంత్రుల రివ్యూలు, సమీక్షలు లేకపోవడంతో గత కొద్దిరోజులుగా సెక్రటెరియట్ నిర్మానుషంగా మారుతోంది. ఏ శాఖ మంత్రులు ఎప్పుడు సెక్రటెరియట్ కు వస్తారో తెలియక పెండింగ్ పైళ్లు ఎదురు చూస్తున్నాయి.
రాష్ట్రంలోని సమస్యలపై ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, సమస్యలకు తగిన పరిష్కారానికి స్పందిస్తారు. కాని ప్రజలు ఎదుర్కుంటున్నా సమస్యలపై మంత్రులకు కలిసి విజ్జప్తి చేద్దామంటే, ఏ మంత్రి ఎక్కడ ఉంటాడో తెలియడం లేదని సెక్రెటరియట్‌కు వచ్చే విజిటర్స్ అంటున్నారు. పదకొండు మంత్రులలో ఒకరిద్దరు తప్ప మిగతా మంత్రులందరూ తమతమ నియోజకవర్గాలకే పరిమితం అయిపోయారు.
వర్షాలు చాలా ఆలస్యంగా కురుస్తున్నాయి. రాష్ట్రం మొత్తం సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాని ఆ శాఖా వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి మౌనంగానే ఉండిపోయారు. ఇప్పటి వరకు వ్యవసాయ పనులు పురోగతిపై సమాధానం చేప్పేందుకు సైతం, ఆయన అందుబాటులోలేరని సెక్రటెరియట్‌లో ఆయన డిపార్టుమెంట్ వారే అంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగే పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.
వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాత్రం కొంత హడావుడి చేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన నియోజకవర్గంలోనే ఉండిపోతున్నారు. సీజనల్ జ్వరాలపై ఆయన స్పందించడంలేదన్న విమర‌్శలున్నాయి. హోం మంత్రి మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డిలు అప్పుడప్పుడు సెక్రటెరియట్ వస్తున్నా వారు ఎప్పడొచ్చి, ఎప్పుడు వెళ్లిపోతారోనని ఆయన పేషీ వారే సమాధానం ఇవ్వడం కొసమేరుపు.
కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, జిల్లాల్లో ఉంటున్నారు. ఇక పోడు వ్యవసాయంపై పెద్ద ఎత్తున ఆందోళన జరగుతున్నా, అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన లేదని గుసగుసలు వినిపిస్తూన్నాయి. మొత్తానికి మంత్రుల హడావిడి లేక సెక్రటెరియట్ నిర్మానుషంగా ఉందని సెక్రటెరియట్ ఉద్యోగులు అంటున్నారు.