TS High Court: ప్రభుత్వ నివేదికపై హైకోర్టు సీరియస్
TS High Court: ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్టు * తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న
TS High Court: కరోనా కట్టడి విషయంపై తెలంగాణ హైకోర్టు మరోసారి కేసీఆర్ సర్కార్‌పై సీరియస్ అయింది. కోవిడ్ కట్టడిలో ఆదేశాలు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ ధరలు సహా పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. సెకండ్ వేవ్ సన్నద్ధతపై డీటెయిల్స్ సమగ్రంగా లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
కరోనా కట్టడికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కోవిడ్ విషయంలో తమ ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా అని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ట ధరలు సవరిస్తూ కొత్త జీవో ఇచ్చారా అని, 14 కొత్త ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని నిలదీసింది. సెకండ్ వేవ్ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరోవైపు కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. మహారాష్ట్రలోని ఒకే జిల్లాలో 8 వేలమంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని గుర్తుచేసిన హైకోర్టు.. థర్డ్ వేవ్‌కు ఏ విధంగా సన్నద్ధమయ్యారని ప్రశ్నించింది. అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా అని ప్రశ్నించింది. నీలోఫర్ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా?. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారని, లైసెన్స్ రద్దుచేసిన ఆస్పత్రులకు బాధితులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చారా అని నిలదీసింది. బంగారం తాకట్టుపెట్టి బాధితులు ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక.. తాము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం మండిపడింది. అయితే డీహెచ్ ఖమ్మం వెళ్లినందున విచారణకు హాజరుకాలేదని ఏజీ బీఎస్‌ప్రసాద్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. రేపు హెల్త్ సెక్రటరీ, డీహెచ్, డీజీపీలు హైకోర్టులో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణ రేపటికి వాయిదా వేసింది.