Telangana Formation Day: ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన ఉస్మానియా యూనివర్సిటీ.. ఉద్యమం ఏదైనా పునాది మాత్రం ఇక్కడే..!

Telangana Formation Day: ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన నేల ఇది. ఉద్యమం ఏదైనా పునాది మాత్రమే ఇక్కడే.

Update: 2024-05-31 12:30 GMT

Telangana Formation Day: ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన ఉస్మానియా యూనివర్సిటీ.. ఉద్యమం ఏదైనా పునాది మాత్రం ఇక్కడే..!

Telangana Formation Day: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పేరు వింటే మొదట గుర్తొచ్చేది తెలంగాణ పోరాటమే. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్ర మర్చిపోలేనిది. విద్యార్థిలోకం పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ చేసిన నినాదాలు ఢిల్లీని కదిలించాయంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది ఉస్మానియా విశ్వవిద్యాలయే. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీపై హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన నేల ఇది. ఉద్యమం ఏదైనా పునాది మాత్రమే ఇక్కడే. ఆనాడు స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. 1969 తొలి దశ ఉద్యమం మొదలు 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు రణ రంగాన్ని తలపించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలు, ఉద్యమ సమయంలో ఆ నేలను తాకిన ప్రతి నెత్తుటి చుక్క సాక్షిగా స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా అలుపెరుగని పోరాటం చేసింది. ఆనాడు పోరాడిన ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. కలలు కన్న స్వరాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ కదనరంగంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన ఆ పోరు రాష్ట్రాన్ని సాధించే వరకు తన తీరు మార్చుకోలేదు. ఉద్యమమేదైనా పునాది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఇక్కడే రాష్ట్రం సిద్ధించి దశాబ్ధం కాలమవతుంది.

సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటగా గుర్తించిన ఉస్మానియా విద్యార్థి లోకం ఉద్యమ బాట పట్టింది. స్థానికులకే సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ 1969 జనవరి 9న పాల్వంచలో అన్నా బత్తుల రవీంద్రనాథ్ చేసిన ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలిచింది. అదే మొదటి అడుగుగా ప్రారంభమైన ఉద్యమం పల్లె పల్లెకు తెలంగాణ భావజాలాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఈ ఉద్యమానికి ఉద్యోగులు సైతం మద్దతు తెలపడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. విద్యార్థుల ఉద్యమాన్ని పసిగట్టిన నాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఉద్యమాన్ని అణచాలని విద్యార్థులపై కాల్పులపై జరిపి, నిర్బంధాన్ని విధించింది. ఫలితంగా 369 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఆ సమయంలో నిప్పుకనికల్లా మండుతున్న విద్యార్థి లోకంపై నాటి సర్కార్ నీళ్లు చల్లింది. కానీ వారిలోని పోరాట పటిమను, స్వరాష్ట్ర కాంక్షను మాత్రం చెరపలేకపోయింది.

1976 వరకు తెలగాణ ప్రాంతానికి మొత్తం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక్కటే ఉన్నత విద్యాసంస్థ. హైదరాబాద్‌ ఓయూ క్యాంపస్‌లోని కాలేజీలే కాకుండా కోఠిలోని మహిళా కాలేజీ, సైఫాబాద్ సైన్స్ కాలేజీ, సికింద్రాబాద్ కాలేజీ, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ దాని అనుబంధ కాలేజీలుగా ఉన్నాయి. తెలంగాణలోని అఫిలియేటెడ్ కాలేజీలు అన్నీ కూడా ఉస్మానియా విశ్యవిద్యాలయం పరిధిలోకి వచ్చేవి. 1972 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలన్నిటికీ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయమే సెంటర్ పాయింట్. ఆ కాలేజీలు ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ తొలి, మలి ఉద్యమాలకైతే గుండెకాయలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం.

అయితే రెండో దశ ఉద్యమంలో ఈ మొత్తం పరిణామాలకు మాత్రం 2001 ఏప్రిల్ 7న హైదరాబాద్‌లోని జలదృశ్యం కేంద్రంగా, తెలంగాణ వాదుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు కేసీఆర్. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ కంటే ముందే అనేక పార్టీలు ఏర్పడ్డాయి. కొన్ని కనుమరుగయ్యాయి. ఇలా అనాడు చల్లబడిన ఉద్యమం కేసీఆర్ ఎంట్రీతో మరలా ప్రాణం పోసుకుంది. నాడు కేసీఆర్‌కు మద్దతుగా ఉస్మానియా విద్యార్థులు మద్దతుగా నిలిచి, ఎన్నో పోరాటాలు చేశారు. 2009 నవంబర్ 9న కేసీఆర్ చేపట్టిణ ఆమరణ నిరాహార దీక్షకు విద్యార్థి లోకమంతా అండగా నిలిచింది.

అయితే కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ నెల ఉస్మానియా విద్యార్థుల కార్యాచరణకు ఓ కీలక అస్త్రంగా మారింది. నవంబర్ 13న క్యాంపస్‌లో సమావేశమైన విద్యార్థులు కేసీఆర్‌కు మద్దతు తెలిపేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే నవంబర్ 18న అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కలిసి విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేశారు. నవంబర్ 21న ఆర్ట్స్ కాలేజీ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ చేపట్టారు. నవంబర్ 28న కేసీఆర్ విరమణ నిరాహార దీక్షకు మద్దతుగా క్యాంపస్‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక కేసీఆర్ నిరాహార దీక్షను నిలిపివేయాలని ఆనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.

కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కిమ్స్ హాస్పిటల్‌కు తలించగా అక్కడ కూడా తన దీక్షను కొనసాగించారు. దీక్ష విరమించకపోవడంతో కేసీఆర్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుందని వైద్యులు ప్రకటించారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థులు మరోసారి రోడ్లపైకి వచ్చి గర్జించారు. నిరసనలు, ర్యాలీలతో హైదరాబాద్ నగరాన్ని అగ్నిగుండంలా మార్చివేశారు. చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చి సబ్బండ వర్గాలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు.

ఇదిలా ఉంటే ఉద్యమ ఉధృతిని పసిగట్టిన ఆంధ్ర నాయకులు, సమైక్యాంధ్ర ఉద్యమానికి తెరలేపారు. దీంతో ఇచ్చినట్టే ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో మరోసారి అగ్గి మీద గుగ్గిలమయ్యారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. 2019 జనవరి 3న లక్షల మందితో విద్యార్థి గర్జన నిర్వహించారు. ఇలా మలి దశ ఉద్యమంలో ఎన్నో పోరాటాలకు బీజం పడింది.

సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, జేఏసీతో కలిసి ఎన్నో పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ విద్యార్థులు గోడును, సబ్బండ వర్గాల ఆకాంక్షను ఆలకించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియాగాంధీ చొరవతో 2013 జులై 30న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. 2014 ఫిబ్రవరి 21న రాజ్యసభ తెలంగాణ బిల్లును ఆమోదించింది,. దీంతో ఉస్మానియా క్యాంపస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. చివరగా 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోద ముద్ర లభించింది.

ఇలా సమైక్య పాలకుల బానిస సంకెళ్లను తెంచడానికి నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదంగా ఉస్మానియా యూనివర్సిటీ జంగ్ సైరన్ మోగించింది. ఈ పోరాటంలో ఎంతో మంది విద్యార్థులు లాఠీ దెబ్బలకు ఓర్చుకుని, రక్తపు బొట్టులను చిందించారు. ఎందరో అమరుల త్యాగాలకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ చివరకు అనుకున్నది సాధించింది.

Tags:    

Similar News