తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా

Telangana: కేంద్రం తీరుపై విద్యుత్ ఉద్యోగుల ఆగ్రహం

Update: 2022-08-08 05:23 GMT

తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా 

Telangana: విద్యుత్ సవరణ చట్టంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. కేంద్రం తీసుకొస్తున్న సవరణలపై మహాధర్నా చేపట్టారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. డిస్కంల ప్రైవేటీకరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ చట్టం 2021 ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్త మార్చి కేంద్రం తప్పుదోవపట్టిస్తోందని విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు.

తాజాగా కేంద్రం తీసుకొచ్చిన అమెండ్‌మెంట్‌లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేయాలంటే కచ్చితంగా డీ లైసెన్సింగ్ అవసరమని, దీనికి సొంత లైన్ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న కరెంట్ లైన్లనే వాడుకోవచ్చని చట్టం చెబుతోంది. ఇలా బిజినెస్ చేయడానికి ముందుకొచ్చే వారికి కచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందేనని కేంద్రం ఇందులో పేర్కొంది. దీనివల్ల ఎవరైనా వ్యక్తులు ప్రస్తుతం ఉన్న లైన్ల ద్వారానే విద్యుత్ సరఫరా వ్యాపారం చేసుకోవచ్చనే అర్థం ఉందని దీనివల్ల రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన డిస్కంలు తీవ్రంగా నష్టపోతాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్రాలకు ఉన్న అధికారాలను నీరుగార్చేలా ఉన్న బిల్లును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం తీరుకు నిరసనగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేలాదిగా ఉద్యోగులు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తమ నిరసనలకు ప్రజలు పూర్తిగా మద్దతు ఇవ్వాలని ఆ సంస్థ ఉద్యోగులు కోరుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండే అవకాశం ఉందని అందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకొస్తున్న సవరణలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం కూడా చేసినట్లు గుర్తు చేస్తున్నారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే బీజేపీ నాయకులు, ఎంపీలు, కేంద్రమంత్రుల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. 

Tags:    

Similar News