CM KCR: యాసంగి నుంచి వరి వద్దు

* వరి సాగు చేయడమంటే ఉరి వేసుకున్నట్లే అని వెల్లడి * రాష్ట్రంలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడే ప్రమాదం

Update: 2021-09-13 03:50 GMT

సీఎం కెసిఆర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు కీలక ప్రకటన చేశారు. యాసంగి నుంచి వరి పంట సాగు చేయకూడదని సూచించారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో ఉప్పుడు బియ్యం కొనలేమని తేల్చి చెప్పిందన్నారు సీఎం. ఇక రాష్ట్రంలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడే ప్రమాదముందని సీఎం హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేయడం శ్రేయస్కారం కాదని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రగతి భవన్‌లో నిన్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి మీటింగ్‌ జరిగింది. ప్రస్తుత వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యం తీసుకోలేమని కేంద్రం తేల్చిచెప్పింది. ఇప్పటికే కేంద్రం వద్ద ఐదేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇక యాసంగిలో కిలో ధాన్యం కొనే పరిస్థితి లేదు. దీంతో సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు సెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయలు పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సీఎం సూచించారు.గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. రైతులు ఈ వానాకాలంలో 55లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. సుమారు 1.40 కోట్ల టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. ఇప్పటికే 70 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రాల్లోని రైస్‌ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉంది. అందుకని రైతులు యాసంగిలో వరి జోలికి పోకపోవడమే మంచిదని నిర్ణయించారు. ఈ మేరకు రైతులను వ్యవసాయశాఖ చైతన్యపర్చాలని సమావేశం అభిప్రాయపడింది.

Tags:    

Similar News