వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వారం పాటు నిర్వహించే అవకాశం
* కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేసీఆర్ వివరణ.. కేంద్రం తీరును ఎండగట్టనున్న కేసీఆర్
CM KCR: ఓ వైపు ఐటీ దాడులు మరోవైపు ఈడీ సోదాలు. కేంద్రం వైఖరిపై భగ్గమంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా బీజేపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు వారం పాటు జరగనున్న ఈ సమావేశాల్లో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కేంద్రం వైఖరితో పాటు ఐటీ, ఈడీ దాడులపై కీలకంగా చర్చించనున్నారు. అంతేకాదు కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ద ఆర్థికవిధానాల ద్వారా రాష్ట్రాల ప్రగతికి ఎలా ఆటంకం కలుగుతుందనే అంశాన్ని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వివరించనున్నారు.
అప్పులు తెచ్చుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రాలకు FRBM పరిమితిని తగ్గించడంపై సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కూడా సమావేశాల్లో చర్చించనున్నారు. వాస్తవానికి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ బడ్జెట్ ను రూపొందించుకుంటాయి. దీన్ని బట్టే FRBM పరిమితులను కేంద్రం వెల్లడిస్తుంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే FRBM పరిమితిని 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను రూపొందించుకున్నది. అయితే కేంద్రం అకస్మాత్తుగా రాష్ట్ర FRBM పరిమితిని 39 వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గిపోయాయి.
అంతేకాకుండా ఆర్థికంగా పటిష్టంగా వున్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు FRBM పరిమితిలో వెసులుబాటు ఉంటుంది. అలా తెలంగాణలో ఈ సౌలభ్యాన్ని పొందనీయకుండా కేంద్రం మెలికపెట్టింది. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటెనే.. 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామని కేంద్రం చెబుతుందని కేసీఆర్ వివరిస్తున్నారు. దీని ద్వారా 6 వేల కోట్లు, FRBM పరిమితి కుదించడం వల్ల 15 వేల కోట్లు మొత్తం కలిపితే 21 వేల కోట్లు ఆగిపోయినట్లు రాష్ట్ర ఆర్థికవర్గాలు లెక్కలు చెబుతున్నాయి.
ఇలా కేంద్రం అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక అజ్జానంతో కూడిన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 40 వేల కోట్లకు పైగా నిధులు రాకుండా ఆగిపోయాయని చెబుతున్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిధులను సమీకరిస్తుండగా ఆ నిధులను కూడా కక్షసాధింపు నిబంధనలతో రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్భంధనం చేసి.. ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తోందని కేంద్రంపై విమర్శలు చేస్తోంది. ఇలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం బావిస్తున్నది. అందులో భాగంగా డిసెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు నిర్వహించి అదే వేదిక ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని యోచిస్తోంది.