హైదరాబాద్‌లో కుక్కల బీభత్సం... హడలిపోతున్న జనం

Stray Dog Attacks in Hyderabad: తెలంగాణలో డిసెంబర్ 12 నుంచి ఈ నెల 2 వరకు అంటే 206 రోజుల్లో సుమారుగా 239 కుక్క కాటు ఘటనలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-07-18 13:04 GMT

హైదరాబాద్‌లో కుక్కల బీభత్సం... హడలిపోతున్న జనం

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడికి 18 నెలల చిన్నారి విహాన్ బలైపోయాడు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మున్సిపల్ కమిషనర్ తీరుపై జవహర్ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. మరోవైపు కుక్కల దాడులను హైకోర్టు సుమోటోగా తీసుకొంది.


తెలంగాణలో ఏడునెలల్లో 239 కుక్కకాటు కేసులు

తెలంగాణలో డిసెంబర్ 12 నుంచి ఈ నెల 2 వరకు అంటే 206 రోజుల్లో సుమారుగా 239 కుక్క కాటు ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల పది మందికి పైగా చనిపోయారు. రాష్ట్రంలో రెండేళ్లుగా కుక్కకాటు కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.

2022 లో 19,847 కేసులు, 2023లో 26,349 కేసులు నమోదయ్యాయి. 2019-2024 ఏప్రిల్ వరకు హైద్రాబాద్ లో కుక్కకాటుతో 54 మంది మరణించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువ మంది చిన్న పిల్లలే. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో పదేళ్లలో 3 లక్షల కుక్కకాటు కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలో 2014 నుంచి 2024 వరకు 3 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ప్రతి ఏటా సగటున 30 వేల మంది కుక్క కాటు బారినపడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ దాడుల్లో సగటున రోజుకు 70 మంది గాయపడుతున్నారు. నెలకు ఇద్దరు చొప్పున రేబిస్ వ్యాధితో మరణిస్తున్నారని రికార్డులు సూచిస్తున్నాయి. కుక్కల బెడదపై గత పదేళ్లలో 3.6 లక్షల ఫిర్యాదులు అందాయి. 2023లో హైద్రాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో 75 వేల రేబిస్ వ్యాక్సిన్లు వేశారు.


హైద్రాబాద్‌లో తగ్గిన కుక్కల స్టెరిలైజేషన్

జంతువుల పునరుత్పత్తి నిరోధించేందుకు చేసే శస్త్రచికిత్సను స్టెరిలైజింగ్ గా పిలుస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల స్టెరిలైజేషన్ తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా వీధికుక్కల బెడదకు కారణమైంది. 2014-15 లో 91,974 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు.

2015 నుంచి 18 మధ్య కాలంలో ఏటా దాదాపు 90 వేల శునకాలకు స్టెరిలైజింగ్ చేశారు. అయితే, 2018-19లో ఈ సంఖ్య 68,359కి పడిపోయింది. 2022-23, అలాగే 2023-24 లో50 వేల పైచిలుకు శునకాలకు మాత్రమే అధికారులు చికిత్స చేశారు.

గ్రేటర్‌లో 4 లక్షల శునకాలు...

హైద్రాబాద్ లో సుమారు 4 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అధికారులు అంచనా. కుక్కల సంతానోత్పత్తిని అదుపు చేసేందుకు ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుంది. ఆరు షెల్టర్ మేనేజర్లు, 22 పారా వెటర్నరీ సిబ్బంది, 362 సెమీ పారా వెటర్నరీ సిబ్బంది పనిచేస్తున్నారు.

అంతేకాదు 24 గంటలు కుక్కలను పట్టుకొనేందుకు 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయినా కూడా నగరంలో కుక్కల బెడద తగ్గలేదు.


వీధి కుక్కలు చిన్నారులపై ఎందుకు దాడులు చేస్తున్నాయి?

హైద్రాబాద్ నగరంలో డంప్ యార్డు ప్రాంతాల్లో కుక్కలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆహారం కోసం అవి తిరుగుతున్న సమయంలో చిన్నారులు ఎదురుపడితే దాడికి దిగుతున్నాయి. మరో వైపు కొత్త ప్రాంతానికి వెళ్లిన కుక్కలు చిన్నారులతో పాటు ఇతరులపై కూడా దాడి చేస్తున్నాయి. కుక్కలను చూసి పరిగెత్తే సమయంలో కూడా అవి దాడులు చేస్తాయి. పిల్లలు ఏవైనా ఆహార పదార్థాలు తీసుకుని వెళ్తుంటే కూడా శునకాలు వెంబడిస్తాయి. ఆహారం దొరకని సమయంలో కుక్కలు ఎక్కువగా దాడులకు దిగే అవకాశం ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. అంటే, కుక్కలు ఆకలితో ఉండడం కూడా సమస్యను తీవ్రం చేస్తోంది.


చిన్నారులపై వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో విశాల్ అనే బాలుడిపై వీధికుక్కలు ఈ ఏడాది జూన్ 29న దాడి చేయాయి. ఆ దాడిలో విశాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలోనే జవహర్ నగర్ ఘటన జరిగింది. వీధికుక్కల దాడిలో మరణించిన పిల్లల కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులుపేసుకుంటే సరిపోదని కోర్టు వ్యాఖ్యానించింది. వీధికుక్కల దాడులు లేకుండా ‎ఎలాంటిజాగ్రత్తలుతీసుకోవాలోచూడాలనిఅధికారులను కోర్టుఆదేశించింది.

హైద్రాబాద్ లో ఉపాధి కోసం వచ్చిన వలస కుటుంబాల పిల్లలు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసి, ఆ తర్వాత దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు కుక్కల బెడద నుంచి ప్రజల్ని కాపాడేందుకు తగిన ప్రణాళికతో చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. 

Tags:    

Similar News