Rama Navami 2021: కమనీయ వేడుకగా భద్రాద్రి రామయ్య కల్యాణం

Rama Navami 2021: ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ వేదిక వద్ద ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారి కల్యాణ వేడుక

Update: 2021-04-21 06:02 GMT

శ్రీరాముని కళ్యాణం (ఫైల్ ఫోటో)

Rama Navami 2021: భక్తి సంద్రంలో ఓలలాడించే కమనీయ వేడుక భద్రాద్రి రామయ్య కల్యాణం. ఆ శుభ తరుణానికి వేళైంది. చైత్ర శుద్ధ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా అంగరంగ వైభవంగా మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత కల్యాణ వేదికలో వేడుకలు నిర్వహిస్తుంటారు. గతేడాది తొలిసారి రామయ్య కల్యాణం అంతరంగికంగా నిత్యకల్యాణ మండపంలో జరిపారు. కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి కారణంగా ఈ సారికూడా నిత్య కల్యాణ మండపంలోనే నిరాడంబరంగా కల్యాణం జరపనున్నారు.

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో జరగనున్న శ్రీసీతారాముల కల్యాణానికి భద్రగిరి ముస్తాబయ్యింది. ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ వేదిక వద్ద ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారి కల్యాణ వేడుక జరగనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌లగ్నమున సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచి కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా జరపనున్నారు. ఈ మేరకు ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీసీతారాముల కల్యాణానికి తానీషా కాలం నుంచి అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించనున్నారు.

కరోనా వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం శ్రేయస్సు దృష్ట్యానే భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారమే భద్రాచలం చేరుకున్న ఆయన. 42 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శ్రీరామ ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం అంతరాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.భద్రాచలంలో 1,22న జరిగే తిరుకల్యాణోత్సవం, మహాపట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని రెండు రోజుల పాటు భక్తులకు అన్ని సేవలను రద్దు చేశారు. స్వామివారి కల్యాణాన్ని టీవీల్లోనే వీక్షించాలని అధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News