హీరో అవ్వాలనుకున్నారు. జీరోగా మిగిలారు. బిల్డప్ ఇచ్చి, బిల్డ్ అవ్వాలనుకున్నారు. గిల్ట్ అయ్యారు. పోడు రైతుల కోసమంటూ, మొన్న అటవీ అధికారులపై కోనేరు బ్రదర్స్ ఆటవిక దాడి గురించే ఇదంతా. మొదటి నుంచి అధికారులపై దాడులు చేయడం వీరికి అలవాటేనని అందరూ అంటున్నారు. అయితే ఈ దాడికి ముందు, దాడి తర్వాత, వారి మనసులో చాలా స్ట్రాటజీలున్నాయి. కానీ అవన్నీ బెడిసికొట్టి, ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారట కోనేరు కోనప్ప అండ్ టీం. గులాబీ అధినేత ఏం చేస్తారో, ఎలాంటి చర్యలుంటాయోనని ఆందోళన చెందుతున్నారట. ఇంతకీ ఈ అటాక్స్ వెనకున్న, పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటి?
కుమ్రం భీమ్ జిల్లా కొత్త సర్సాల గ్రామంలో అటవీ అధికారులపై దాడి దేశవ్యాప్తంగా సంచలనగా మారింది. అటవీ భూమిని అటవీ అధికారులు హరితహారం కోసం చదును చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప, ఆయన సోదరుడు జడ్పీ వైఎస్ చైర్మన్ క్రిష్ణ, అతని అనుచరులు అటవీ అధికారులపై దాడి చేశారు. భూములు ఎలా చదును చేస్తారని ఎమ్మెల్యే తమ్ముడు క్రిష్ణ రెచ్చిపోయి ఏకంగా మహిళా అధికారి అని చూడకుండా కర్రలతో విచక్షణారహితంగా అనిత అనే ఆఫీసర్‌పై తీవ్రంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డారామె. ఆమెతో పాటు మరో పదిమంది అటవీశాఖ సిబ్బంది, ఎమ్మెల్యే అనుచరుల ఆటవిక దాడిలో గాయపడ్డారు. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో బిక్కుబిక్కుమంటున్నారట కోనేరు బ్రదర్స్.
అయితే కోనేరువారికి ఈ ఆటవిక దాడులు కొత్తేంకాదు. కోనేరు సోదరులు, అతని అనుచరులు గతంలోనూ చాలామంది అధికారులపై దాడులు చేశారు. కానీ ఆధారాల్లేకుండా వ్యూహాత్మకంగా మాయం చేశారు. గతంలో ఎమ్మెల్యే అనుచరులు రహస్యంగా నల్లబెల్లం తరలించుకుపోతుంటే, ఎక్సైజ్ సీఐ మంగమ్మ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారట. దీంతో ఆమెపైనా, ఉద్యోగులపైనా నడిరోడ్డులో దాడి చేశారట కోనేరు సోదరులు. అయినా ఒక్క కేసూ ఫైల్ కాలేదు. ఎందుకంటే, ఆధారాల్లేవని నమ్మబలికారట. ఇప్పుడు కూడా అటవీ అధికారులను అలాగే చితకబాది, సాక్ష్యాల్లేవని రిలాక్స్ అయిపోయారట. కానీ ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఏదీ దాగదని, ఆలస్యంగా బోధపడింది కోనేరు బ్రదర్స్‌కి.
అయితే ఎమ్మెల్యే తమ్ముడు క్రిష్ణ, అనుచరులు దాడి చేసిన దృశ్యాలు అటవీ అధికారులు బయటకు విడుదల చేశారు. ఆ దాడి విజువల్స్ లో మహిళా అధికారిపై దాడిని చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. కర్రల యుద్ధం కంటికి కట్టినట్టుగా కనిపించింది. అయినా సదరు ఎమ్మెల్యే, తమ్మున్ని రక్షించడానికి కొత్త నాటకానికి తెరలేపారు. ఈసారి గ్రామస్థులతో మొదలుపెట్టారు. దీనికి స్క్రిప్ట్‌ను ఎమ్మెల్యే కోనప్ప సిద్దం చేశారట. ఇంకేముంది, ఆ గ్రామస్థులను పిలిపించారు. పదిహేను రోజులుగా తమపై అటవీ అధికారులు దాడి చేస్తున్నారని చెప్పాలని బోధించారట. అదే విషయాన్ని మీడియా ముందు అప్పగించాలని ముందుకు నెట్టారట. ఇది చెబితే కేసులూ గీసులు ఉండవని, దాడి చేసినా తమ్ముడూ బయటపడుతారని సంబర పడ్డారట ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కానీ కథ అడ్డం తిరిగింది. సోదరద్వయంపై ముప్పేట దాడి పెరిగింది.
ఎమ్మెల్యే స్క్రీన్ ప్లే డైరెక్షన్ రివర్సయ్యింది. అటవీ అధికారుల దాడికి అల్లిన వ్యూహం బయటపడింది. ఎమ్మెల్యే పూస గుచ్చినట్లుగా ప్రతి అంశం వీడియోతో సహా బయట పడింది. ఈసారి తమ్మున్ని ఉచ్చులో నుండి పడేయటానికి బదులు తానే ఉచ్చులో పడ్డానంటూ, కంటిమీద కనుకు లేదట ఎమ్మెల్యేకు. చివరకు పార్టీ పెద్దలు సైతం చర్యలు తీసుకుంటారని హెచ్చరించడంతో తెగ టెన్షన్ పడుతున్నారట.
మొదటి నుంచి వివాదం సృష్టించడం, పరిష్కరించడం కోనేరుకే చెల్లుతుందని నియోజకవర్గంలో ప్రచారముంది. ఈసారి పదవి పోకుండా రైతుల పోరు బిడ్డగా మారడానికి ఏకంగా రాజీనామా అస్త్రాన్ని సంధించారట. రాజీనామా పత్రంలో, రైతుల కోసమే, పోడు రైతుల కోసమే త్యాగమంటూ తమ్ముడి జడ్పీ వైస్ ఛైర్మన్ పదవికి, జడ్పీటీసీ పదవికీ రాజీనామా చేయించారు. రాజీనామా ఆమోదం పొందకుండా, పదవి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. రాజీనామాను జడ్పీ పరిషత్ అధికారులకు ఇవ్వకుండా, కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్‌కు ఇప్పించారు. పోడు భూముల కోసం తమ్ముడు ఎనలేని త్యాగం చేశారని జోరుగా ప్రచారం కూడా మొదలుపెట్టారట.
తమ్ముడి త్యాగానికి రైతులు ఉద్యమంలా కదులుతారని భావించారట. దాడి చేసిన రెండోరోజు పోడు భూముల పోరాట యోధునికి మద్దతుగా నిలవాలని పార్టీ నాయకులకు పిలుపు నిచ్చారట. ఎమ్మెల్యే పిలుపుకు స్పందించిన పార్టీ కార్యకర్తలు, మహిళా అధికారిపై దాడి చేసిన క్రిష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు మద్దతుగా నిలుస్తున్నారని ప్రచారం చేసుకుంటూ, సంతోషంలో తేలిపోయారట ఎమ్మెల్యే. కాని ప్రతిపక్షాలు, సొంత పార్టీ నాయకులు పాలాభిషేకంపై విమర్శలు చేయడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక టెన్షన్ పడుతున్నారట ఎమ్మెల్యే.
అటవీ అధికారులపై దాడితో పోడు రైతుల దృష్టిల్లో హీరో అవ్వాలని అన్నాతమ్ముళ్లు స్కెచ్ వేశారని అర్థమవుతోంది. ఎన్ని కేసులు నమోదైనా రైతులు బాసటగా నిలుస్తారని, దాంతో కేసుల విషయంలో ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతుందని అనుకున్నారట. అందుకే మొదటగా తమ్ముడు జడ్పీటీసీ, వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వెంటనే, తరువాతి రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అనుచరులతో చెప్పారని జోరుగా ప్రచారం సాగింది. రైతుల కోసం రాజీనామా చేస్తే నియోజకవర్గంలో ఎదురుండదని భావించారట. కాని సీఎంతో సహా, పార్టీ పెద్దలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యకం చేయడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. రాజీనామాపై వెనక్కి తగ్గారట. దాంతో దాడి ఎటువైపు మళ్లుతుందోనని ఆందోళన చెందుతున్నారట కోనేరు బ్రదర్స్.
మొత్తానికి కర్రల యుద్ధంతో కకావికలమవుతున్నారు కోనేరు బ్రదర్స్. అటవీ అధికారులపై తమ్ముడి వీరంగంతో, ఎమ్మెల్యే మరింత టెన్షన్ పడుతున్నారట. దాడి చేసిన దృశ్యాలు సహా వ్యాఖ్యానాలు బట్టబయలు కావడంతో, దిక్కుతోచనిస్థితిలో పడ్డారు కోనేరు కోనప్ప. హీరో అవ్వాలన్న వ్యూహం బెడిసికొట్టి జీరోగా మారి, కంగారుపడుతున్నారు. కేసులపరంగా, పార్టీపరంగా మున్ముందు ఎలాంటి చర్యలు వుంటాయోనని ఆందోళన చెందుతున్నారట. అడుసు తొక్కనేల కాళ్లు కడగనేల అన్న సామెతను కోనేరు బ్రదర్స్ వంటబట్టించుకుంటే మంచిదని, సొంత పార్టీ నేతలే సూచిస్తున్నారట.