తమ్ముడి రూపంలో అన్నకు తలనొప్పి పెరుగుతోందా?

Update: 2019-07-30 13:47 GMT

ఎమ్మెల్యేగా ఓడిన‌ బాధ నుంచి, ఎంపీగా గెలిచిన‌ ఆనందం ఆ నేతను మరింత ముందుకు తీసుకెళుతోందా అటు అధికార టిఆర్ఎస్‌‌ను టార్గెట్ చేస్తూనే, ఇటు తన పార్లమెంటు పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం సవాల్‌గా తీసుకున్నారా ఇక‌ మున్సిపల్ ఎన్నికల్లోనూ తన‌ పార్లమెంటు ‌పరిధే కాకుండా, మరో ఎంపీ లిమిట్స్‌లోనూ కాన్‌సన్‌ట్రేట్ చేశారా అంతా దూకుడుగానే వెళుతున్నా, తమ్ముడి రూపంలో మాత్రం, ఆ నాయకునికి కంటి మీద కునుకులేకుండా పోతోంది. మరి అన్న విషయంలో తమ్ముడు చేసిందేంటి?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ ‌అటు సొంత పార్టీ నేతలను తనదైన‌ శైలిలో విమర్శిస్తారు ఇటు పవర్‌లో ఉన్న టిఆర్ఎస్‌ను, సిఎం‌ కేసీఆర్‌ను, కుటుంబాన్ని తనదైన శైలిలో విమర్శించి పతాక శీర్షికలెక్కుతారు. నల్గొండ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు వరుసగా గెలిచి రికార్డు సృష్టించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఐదోసారి‌ కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

దీంతో‌ ఓడిన నాడే, ఆ బాధను దాటవేస్తూ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు కోమటిరెడ్డి. నల్గొండ నుంచే పోటీ అని తనకు తానే ప్రకటించుకున్నారు. అయితే కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ పార్లమెంటు ‌పరిధి‌కంటే, భువనగిరి పార్లమెంటులో సన్నిహిత సంబంధాలు, ప్రజాదరణ ఎక్కువగా ఉంది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ‌అనూహ్యంగా నల్గొండ ‌నుంచి తప్పుకుని, భువనగిరి పార్లమెంటుకు పోటి చేసేలా అడుగులేశారు. దీంతో రాజకీయ వ్యూహం కలిసొచ్చి టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్‌పై విజయం సాధించారు.

ఇక ఎమ్మెల్యేగా కోమటిరెడ్డిను ఓడించినా, ఎంపీగానూ ఓడించాలన్న టిఆర్ఎస్‌ ఫ్లాన్‌ను ఎదుర్కొని గెలిచారు కోమటిరెడ్డి. ఇక‌ గెలిచిన‌‌‌ నాటి నుంచి తన ఆరోపణలను టిఆర్ఎస్‌పై‌ ముమ్మరం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీ, సచివాలయం సాగునీటి ప్రాజెక్టులపై ఘాటైన విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు.

భువనగిరి ఎంపీగా, తన‌‌ పార్లమెంటు ‌పరిధిలోని‌ సమస్యలపై ఢిల్లీ వేదికగా చెలరేగిపోవాలని డిసైడయ్యారు కోమటిరెడ్డి. మూసీ‌నది‌ ప్రక్షాళన, జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు భువనగిరి, ఆలేరు, జనగాం లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపితే, దాదాపు ముప్పై వేల‌మందికి ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యాదాద్రికి ఎంఎంటిస్ ట్రైన్‌ను ఏర్పాటు చేయాలని‌, ఇలా అనేక డిమాండ్లపై గళమెత్తారు.‌

అటు టిఆర్ఎస్‌పై, ఇటు అభివృద్ధిపై దృష్టి సారించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, తమ్ముడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది. తనతో పాటు తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా‌ బిజెపిలో చేరతారన్న, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఇరకాటంలో పడేసాయి.

అయితే‌ పార్టీ మార్పుపై ఎప్పటికప్పుడు వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూ వస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇబ్బందులపాలు చేస్తున్నాయి. ఇదంతా‌ పక్కన పెట్టి వెంకట్ రెడ్డి, ‌మున్సిపాలిటీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఆలేరు, భువనగిరి, నకిరేకల్లు, నల్గొండ నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటన చేస్తున్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరికే ఎంపీ‌ అయినా, నల్గొండ ‌పార్లమెంటు పరిధిలోని పలు‌ మున్సిపాలిటీ ఏరియాలపై ఆ‍యనకు పట్టుంది. అందుకే కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. నల్గొండ నుంచి గెలిచిన‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ, హుజుర్ నగర్‌లకే పరిమితం అయ్యారు. అయితే వెంకట్ రెడ్డి ఒక అడుగు‌‌ముందుకేసి అటు భువనగిరి పార్లమెంటు ఇటు నల్గొండ ‌పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీలపై దృష్టి సారించారు.

మొత్తంగా ఎంపీ‌గా, రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపై ‌విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారమే క్షేత్రస్థాయిలో ఇబ్బందిగా మారిందన్న చర్చ జరుగుతోంది.  

Full View

Tags:    

Similar News