South Central Railway: రైల్వేలో ఉద్యోగాలకు ఎర్రజెండా..బోర్డు కీలక నిర్ణయం
South Central Railway: దక్షిణ మధ్య రైల్యే శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది.
South Central Railway: దక్షిణ మధ్య రైల్యే శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భద్రత(సేఫ్టీ)కు సంబంధించిన పోస్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇతర పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ విషయంలో బ్రేక్ వేసింది. బోర్డు జాయింట్ డైరెక్టర్ అజయ్‌జా అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, ప్రొడక్షన్ యూనిట్లకు ఈ మేరకు గురువారం రాత్రి కీలక ఆదేశాలు జారీచేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త నోటిఫికేషన్లు చేపట్టవద్దంటూ తెలిపారు. బోర్డు జాయింట్ డైరెక్టర్ అజయ్‌జా అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, ప్రొడక్షన్ యూనిట్లకు జారీ చేసిన ఆదేశాలపై గందరగోళం నెలకొనడంతో రైల్వేబోర్డు డైరెక్టర్ జనరల్(హెచ్‌ఆర్) ఆనంద్ ఎస్ ఖాతి శుక్రవారం స్పందించారు.
రైల్వే శాఖలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏ ఉద్యోగిని కూడా తొలగించబోమని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రైల్వే ఆదాయం 58శాతం మేర తగ్గిందని ఆయన తెలిపారు. ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే కొన్ని కఠిన చర్యలు తప్పవన్నారు. వ్యయ నియంత్రణకు ఆదాయాల పెంపునకు కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నియామక ప్రక్రియలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2018 నుంచి రైల్వే భద్రతా విభాగంలో 72,274, మిగిలిన వాటిల్లో 68,366 మొత్తంగా 1,40,640 ఖాళీలున్నాయన్నారు. భద్రతా విభాగంలో కూడా నియామక ప్రక్రియకు ఆటంకం ఉండబోదన్నారు. మిగిలిన విభాగాల్లో కూడా మధ్యలో ఉన్న నియామక ప్రక్రియలు కొనసాగుతాయని తెలిపారు.
కొత్త పోస్టుల సృష్టిని నిలిపివేయడం, ఖర్చు తగ్గించడం, డిజిటల్ ప్లాట్‌ఫాంను ఎక్కువగా ఉపయోగించుకోవడం, వర్క్‌షాపుల్లోని మానవశక్తిని హేతుబద్ధీకరించడం లాంటి చర్యలు తీసుకోవాలని రైల్వేలోని ఆర్థిక విభాగం అన్ని జోన్లకు సూచించింది. పెరుగుతున్న అవసరాలు, కొత్తగా పట్టాలెక్కే రైళ్లు, కొత్త రైల్వేలైన్లు, ఇతర ప్రాజెక్టులకు అదనంగా ఉద్యోగులు కావాల్సి ఉంటుందన్నారు. రైల్వేలో అవసరాలను బట్టి ఉద్యోగుల నియామకం జరుగుతుందని, అనుమతి పొందిన పోస్టులకు అదనంగా కొత్త ఉద్యోగాలను మంజూరుచేస్తుంటారు. వాటిల్లో భద్రత అంశానికి సంబంధించినవి మినహా.. మిగిలినవాటిలో ఏదైనా కారణంతో భర్తీ ప్రక్రియ ప్రారంభించకపోతే అందులో 50 శాతం పోస్టులను సరెండర్ చేయాలని రైల్వేబోర్డు స్పష్టం చేసింది. ఇక పోతే రెండేళ్లక్రితం దేశవ్యాప్తంగా పలు కొత్త రైల్వేలైన్లు, నూతన రైళ్ల కోసం పోస్టులను మంజూరు చేశారు. ఇక పోతే ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వేలో 80,525 మంది విధులు నిర్వహిస్తున్నారు.