Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, విగ్రహం ధ్వంసం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

Update: 2024-10-20 14:57 GMT

Muthyalamma Temple Vandalism Case: సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ పరిధిలో ఉన్న ముత్యాలమ్మ గుడిలో గత వారం కొంతమంది గుర్తుతెలియని ముస్లిం వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గుడిలో అమ్మవారి విగ్రహంపై నిందితులు దాడికి పాల్పడటం, ధ్వంసం చేయడం వంటి దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముత్యాలమ్మ తల్లి గుడిపై దాడి ఘటనలో తాజాగా హైదరాబాద్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని మెట్రోపోలిస్ హోటల్ యజమాని రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ముంబైకి చెందిన మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా కూడా మరో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మోటివేషనల్ క్లాసెస్ పేరుతో సెమినార్స్ నిర్వహిస్తోన్న మునావర్.. అక్కడికి వచ్చే ముస్లిం యువకులను ఒక్క చోట చేర్చి వారికి హిందువులకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలా మునావర్ చెప్పిన బోధనల ప్రభావంతోనే అతడి మాటలను స్పూర్తిగా తీసుకున్న ఓ ముస్లిం యువకుడే ఆరోజు రాత్రి ఇలా ముత్యాలమ్మ గుడిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మునావర్ జమాకు, అతడి వద్ద శిక్షణ తీసుకోవడానికి వచ్చేవారికి సికింద్రాబాద్ మెట్రోపోలిస్ హోటల్ యాజమాన్యం, సిబ్బంది సహాయసహకారాలు అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ ముగ్గురిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలోనే హోటల్ యజమాని రషీద్ ని, అతడి వద్ద మేనేజర్ గా పనిచేస్తోన్న రెహ్మాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

మెట్రోపోలిస్ హోటల్ సీజ్, రికార్డులు స్వాధీనం

హోటల్లో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. హోటల్ ని సీజ్ చేయాల్సిందిగా సికింద్రాబాద్ ఆర్డీఓకు సూచించారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ సిఫార్సులు, స్థానిక ఆర్డీఓ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ తహశీల్దార్ పాండూనాయక్ ఆ హోటల్ ని సీజ్ చేశారు. పోలీసులు అక్కడి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు మునావర్ జమా కోసం గాలిస్తున్నారు. 

Tags:    

Similar News