ఆరెస్సెస్ ఈ పేరు తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. మరో ఐదేళ్ళలో వందేళ్ళు పూర్తి చేసుకోనుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 1925లో ఏర్పడిన ఈ సంస్థ నేటికీ విస్తరణపథంలో ముందుకు సాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణపై మరింతగా దృష్టి సారించింది.
దేశంలో ఆరెస్సెన్ పై వచ్చినన్ని వివాదాలు మరే సంస్థపై కూడా వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకోకపోవడం మొదలుకొని గాంధీజీ హత్యతో ప్రమేయం, మతఘర్షణలకు ఆజ్యం పోయడం వంటి ఆరోపణలెన్నో వచ్చాయి. అవేవీ కూడా ఆరెస్సెస్ ను దేశప్రజలకు దూరం చేయలేకపోయాయి. నేడు లక్షలాది మంది సభ్యులు ఆరెస్సెస్ లో ఉన్నారు. సంఘ్ పరివార్ లో భాగమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరో వైపున తెలంగాణ లో బలోపేతమయ్యేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తోంది.
1925 సెప్టెంబర్ 27 విజయదశమి ఈ రోజున మనం సంఘ్ ను ప్రారంభిస్తున్నాం అని ప్రకటించారు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్. అలా మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో హెగ్డేవార్ ఇంట్లో సంఘ్ ప్రారంభమైంది. సమీపంలోని మైదానంలో ఓ ఐదారుమందితో శాఖ ప్రారంభమైంది. అదే నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆరెస్సెస్ ను ప్రారంభించిన హెగ్డేవార్ మరెవరో కాదు తెలంగాణలోని బోధన్ వద్ద కందకుర్తి అనే చిన్నగ్రామంతో అనుబంధం కలిగిన వ్యక్తి. ఆయన పూర్వీకులు కందకుర్తికి చెందిన వారే.
మనమంతా కూడా తప్పనిసరిగా శారీరకంగా, మేధోపరంగా శిక్షణ పొందాలి అని సంఘ్ ప్రారంభం రోజున హెగ్డేవార్ అన్నారు. అప్పట్లో ఆదివారం పూట డ్రిల్, మార్చ్ లాంటి అంశాల్లో శిక్షణ ఇచ్చేవారు. గురు, ఆదివారాల్లో జాతీయ అంశాలపై చర్చించేవారు. మొదట్లో సంస్థ పేరు సంఘ్ గానే ఉండింది. 1926 ఏప్రిల్ 17న సంస్థకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే పేరు ఖరారు చేశారు. 1929లో సర్ సంఘ్ చాలక్ గా హేగ్డేవార్ నియమితులయ్యారు. 1930లో కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ ను లక్ష్యంగా ప్రకటించింది. ఆ నేపథ్యంలో జనవరి 26ను స్వాతంత్ర్య దినోత్సవంగా నిర్వహించాల్సిందిగా హెగ్డేవార్ ఆదేశించారు. అదే ఏడాది జంగిల్ సత్యాగ్రహంలో హెగ్డేవార్ పాల్గొని జైలుపాలయ్యారు. తదనంతర కాలంలో ఆరెస్సెస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైంది. సభ్యులకు మాత్రం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే స్వేచ్ఛను ఇచ్చింది. హిందూత్వ భావన పునాదులపై నిర్మితమైన ఆరెస్సెస్ ఆ దిశలోనే ముందుకుసాగుతోంది.
భూదానోద్యమం, కులతత్వ నిర్మూలన, తుపాను సమయాల్లో సహాయ చర్యలు, పునరావాసం వంటి వాటి పేరు చెప్పగానే ముందుగా గుర్తుచ్చేది ఆరెస్సెస్ అంటే అతిశయోక్తి కాదు. వివిధ సేవా కార్యకలాపాలను సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత జాతి నిర్మాణంలో ఆరెస్సెస్ కీలకపాత్ర పోషించింది. పోర్చుగీసు పాలనలో ఉన్న భూభాగాలు భారత్ లో విలీనం కావడంలో ప్రముఖంగా నిలిచింది. రాజకీయాలతో సంబంధం లేదని సంస్థ చెబుతున్నప్పటికీ పలు రాజకీయ, సామాజిక సంస్థలు సంఘ్ పరివార్ లో భాగంగా ఉన్నాయి.
నిషేధాలు ఆరెస్సెస్ కు కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యం రాక ముందే ఆరెస్సెస్ ఒకసారి నిషేధానికి గురైంది. 1947 జనవరిలో పంజాబ్ ప్రావిన్స్ లో ఆరెస్సెస్ ను నిషేధించారు. ఆ తరువాత గాంధీజీ హత్య సందర్భంలో కూడా ఆరెస్సెస్ ను కొంతకాలం నిషేధించారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ఇందిరగాంధీ ఆరెస్సెస్ ను నిషేధించారు. నిషేధాలను తట్టుకొని ఆరెస్సెస్ మరింతగా బలపడింది. ఎమర్జెన్సీ తరువాత జనతా ప్రభుత్వ ఏర్పడేందుకు, ఆ ప్రభుత్వం కూలిపోయేందుకు ఆరెస్సెస్ కారణం అనే వారూ ఉన్నారు. ద్వంద సభ్యత్వం కారణంతో జనతా ప్రభుత్వం పడిపోయింది.
జాతి నిర్మాణంలో ఆరెస్సెస్ కీలకపాత్ర పోషించింది. దాద్రా, నగర్ హవేలి, దామన్ దీవులు పోర్చుగీసు పాలన నుంచి భారత్ లో విలీనం కావడంలో ఆరెస్సెస్ ముఖ్య పాత్ర వహించింది. గోవా విముక్తిలోనూ ఆరెస్సెస్ ప్రముఖ పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఆరెస్సెస్ అండగా నిలిచింది. ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణలో తోడ్పడింది. రాజకీయాలతో తనకు సంబంధం లేదని ఆరెస్సెస్ చెబుతుంటుంది. కాకపోతే పరోక్షంగా మాత్రం రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూనే ఉంది. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా సంఘ్ పరివార్ లో భాగమే. అది ఒక్కటే కాదు హిందూత్వ భావనతో ఉన్న మరెన్నో సంస్థలు కూడా సంఘ్ పరివార్ లో కీలకంగా ఉన్నాయి. ఏబీవీపీ, వీహెచ్ పీ, బజ్ రంగ్ దళ్, సేవా భారతి లాంటి సంస్థలు అనేకం సంఘ్ పరివార్ లో ఉన్నాయి.
ఏదైనా రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ముందుగా అక్కడ బలపడేది ఆరెస్సెస్ అని అంటుంటారు. ప్రస్తుతం ఆరెస్సెస్ దక్షిణాదిపై దృష్టి పెట్టింది. మరే రాష్ట్రంలో లేనని శాఖలు కేరళలో ఉన్నాయని అంటారు. ఇక తెలంగాణ లో కూడా ఆరెస్సెస్ విస్తరించనుంది. తాజాగా జరుగుతున్న విజయ్ సంకల్ప్ సమావేశాలు అందుకు బీజం వేసే అవకాశం ఉంది.