హైదరాబాద్‌కు రూ.10వేల కోట్ల కేటాయింపు: ఖర్చు చేసింది ఎంతో తెలుసా?
కాగ్ రిపోర్ట్ మేరకు హైద్రాబాద్ నగర అభివృద్ది కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించినా వాటిని ఖర్చు చేయలేదు.
కాగ్ రిపోర్ట్ మేరకు హైద్రాబాద్ నగర అభివృద్ది కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించినా వాటిని ఖర్చు చేయలేదు. 2023 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సారానికి తెలంగాణ శాసనసభలో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పలు శాఖల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొందని ఈ నివేదిక వివరించింది.
హైద్రాబాద్ అభివృద్దికి రూ. 50 వేల కోట్ల అంచనా..ఖర్చు ఎంతో తెలుసా?
హైద్రాబాద్ నగర అభివృద్ది కోసం అప్పటి కేసీఆర్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందు కోసం రూ. 50 వేల కోట్లు అవసరమౌతాయని అంచనా వేసింది. నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు, అంతర్జాతీయ నగరానికి అవసరమైన అన్ని హంగులను సమకూర్చాలనేది అప్పటి ప్రభుత్వ ఉద్దేశ్యం. నగరానికి తలమానికంగా ఉన్న మూసీ నదిని శుద్ది చేయాలని భావించింది.
2020-21 బడ్జెట్ లో మూసీ ప్రక్షాళనతో ఇతర అవసరాల కోసం రూ. 10 వేల కోట్లను కేటాయించారు. కానీ, ఈ నిధులను ఖర్చు చేయని విషయాన్ని కాగ్ నివేదిక బయటపెట్టింది. మరో వైపు 2021-22 బడ్జెట్ లో రూ. 2600 కోట్లు, 2022-23 లో రూ. 200 కోట్లు కేటాయించినా ఖర్చు చేయలేదు.
ప్రతి ఏటా హైద్రాబాద్ కోసం కేటాయించే నిధులు తగ్గుతూ వచ్చాయి. అయినా కూడా ఈ నిధులను ఖర్చు చేయలేదు.
మెట్రో రైలుకు రూ.878 కోట్లు కేటాయింపు...పైసా ఖర్చు చేయలేదు
హైద్రాబాద్ నగరంలో పాతబస్తీ మెట్రో రైలు మార్గానికి రూ. 500 కోట్లు, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణకు మరో రూ. 378 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు. అయితే ఈ పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ నిధులను వెనక్కి తీసుకున్నారు. హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిధులను భరిస్తుందని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు.
దళితబంధుకు రూ. 17,700 కోట్లు ఎంత ఖర్చు చేశారంటే?
కేసీఆర్ ప్రభుత్వం దళితబంధుకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని భావించారు. తొలుత ఎంపిక చేసిన మండలాల్లోనే ఈ పథకాన్ని అమలు చేశారు. 2022-23 బడ్జెట్ లో దళితబంధుకు రూ. 17,700 కోట్లు కేటాయించారు. అయితే ఇందులో రూ. 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
సోషల్ వేల్ఫేర్ శాఖ పరిధిలో రైతుల పంట రుణమాఫీ కోసం రూ. 4 వేల కోట్లు కేటాయించారు. అయితే ఇందులో రూ. 36 కోట్లు మాత్రమే వినియోగించారు. పంచాయితీరాజ్ శాఖలో టీడీడబ్ల్యుఎస్ సీఎల్ కు రుణాల కోసం రూ. 4589 కోట్లు కేటాయించారు. కానీ, రూ. 1,274 కోట్లు మాత్రమే ఉపయోగించారు.
బడ్జెట్ లో నిధులు కేటాయించినా...రూ. 85 వేల కోట్ల ఆదా
రాష్ట్ర బడ్జెట్ లో 17 గ్రాంట్లలో 23 విభాగాలకు సంబంధించిన ఒక్కో సెక్షన్ లో కనీసం వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయలేదు. 2022-23 సంవత్సరంలో మొత్తం రూ. 85,301 కోట్లను ఖర్చు చేయలేదు. మరోవైపు జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారంగా బడ్జెట్ లో వైద్య, ఆరోగ్య రంగానికి 8 శాతం కంటే ఎక్కువ నిధులుండాలి. అయితే బడ్జెట్ లో మాత్రం తక్కువగానే నిధులను కేటాయించారు. 2016-17 నుంచి 2021-22 వరకు ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.53 నుంచి 3.47 శాతంగా ఉన్నాయి.
మరో వైపు ప్రాజెక్టులను ఆలస్యంగా ప్రారంభించడంతో అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వంపై భారం పడింది. కొన్ని శాఖల్లో పన్ను చెల్లింపు వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకున్న విషయాన్ని కూడా కాగ్ ఎత్తి చూపింది.