Mission Bhagiratha: 704 మంది మిషన్ భగీరథ వర్క్ ఇన్‌స్పెక్టర్ల తొలగింపు..
Mission Bhagiratha:తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ బాధలు తొలగిపోతాయి
Mission Bhagiratha: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ బాధలు తొలగిపోతాయి అని ఎదురుచూసిన క్రమంలో ప్రభుత్వం అడపా దడపా కొన్ని నోటిఫికేషన్లను విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన విషయం తెలిసిందే. హమ్మయ్య ఉద్యోగం వచ్చింది, ఇంకా ఏ కష్టాలు తమను దరి చేరవు అనుకునే క్రమంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒక్క సారిగా మిషన్ భగీరథ ప్రాజెక్టులో పనిచేస్తున్న వర్క్‌ఇన్‌స్పెక్టర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మంగళవారం అంటే జూన్ 30న వారికి చివరి పనిదినంగా పేర్కొంటూ అధికారికంగా వర్క్‌ఇన్‌స్పెక్టర్లకు తెలియజేసింది. అంతే కాదు హైదరాబాద్‌లోని మిషన్ భగీరథ రాష్ట్ర కార్యాలయం ఉద్యోగులు జులై ఒకటి నుంచి విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని వివిధ జిల్లాలకు చెందిన భగీరథ ఎస్‌ఈలకు ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 704 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు రోడ్డున పడాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన సర్కులర్లను కూడా ప్రభుత్వం గత శనివారమే జారీచేసింది.
ఐదేండ్ల క్రితం ప్రాజెక్టును ప్రారంభించి సుమారు రూ. 40 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం పట్టభద్రులైన ఇంజినీర్లను వర్క్‌ఇన్‌స్పెక్టర్లుగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా నియమించింది. ఈ ఉద్యోగులకు వేతనం కింద ప్రతినెలా రూ. 33,400 నిర్ణయించగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ.23,100 మాత్రమే ఉద్యోగుల చేతికి అందించింది. మరో రూ. 10,300ను ఎజెన్సీలు కమిషన్ కింద తీసుకునేవి. మొత్తం 704 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లల్లో 30 శాతానికిపైగా మహిళలు సైతం ఉండటం గమనార్హం. ఇక వీరందరినీ తొలగిస్తే ప్రభుత్వానికి రూ. 30 కోట్లు ఆదా అవుతాయని సమాచారం. ఇక ఇప్పటికే ఉద్యానవణ శాఖలో విధులు నిర్వహిస్తున్న 2000 పైగా ఉధ్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇక ఈ నిరుద్యోగుల భవిష్యత్తు ఏ విధంగా మారనుందో చూడాల్సిందే.