ఇందూరులో ప్రోటోకాల్‌ రగడ ఎవరి మెడకు చుట్టుకుంటోంది?

Update: 2019-11-22 08:45 GMT
నిజామాబాద్

ఆ జిల్లాలో పనిచేసేందుకు అధికారులు హడలిపోతున్నారా..? అధికార - ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల మధ్య నలిగిపోతున్నారా.....? కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అధికారులు పరిస్ధితి మారిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న ఓ జిల్లా స్ధాయి అధికారి బదిలీ నిన్న ఓ మహిళా అధికారి సరెండర్ వెనుక అసలు ఏం జరుగింది..?

నిజామాబాద్ జిల్లా అధికారులకు కొత్త భయం పట్టుకుందట. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓ లెక్కా ఇప్పుడో లెక్కా అంటూ అధికార పార్టీ నేతలు అంటుండటంతో అధికారులు హడలిపోతున్నారట. ఈ పరిస్ధితికి ఓ కారణం లేకపోలేదనే చర్చ ఇందూరు పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ ఎంపీగా విజయం సాధించారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గతంలో ఎంపీ - ఎమ్మెల్యేలు అధికార పార్టీ నేతలే ఉండటంతో సమస్యలు ఉండేవి కావట. అధికారులు హ్యాపీగా తమ పనిచేసుకునేవారట. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల అనంతరం పరిస్ధితి పూర్తిగా మారింపోయిందట.

ఎంపీ సమీక్షకు వెళితే ఆ అధికారులకు ఎమ్మెల్యేల నుంచి అక్షింతలు పడుతున్నాయట. కొందరికైతే బదిలీల బహుమానం మరికొందరికి, సరెండర్ల నజరానా కూడా ఇస్తున్నారట. ఇప్పటికే ఆర్.అండ్.బి. ఈఈ హన్మంతరావును ఆకస్మిక బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా మహిళా శిశు సంక్షేమశాఖ పీడీని ప్రభుత్వానికి సరెండర్ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇద్దరు జిల్లాస్ధాయి అధికారుల వ్యవహారంలో రాజకీయ వివాదం కారణంగా బదిలీ వేటు, సరెండర్ ఉత్తర్వులు జారీ కావడంపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.

ఐ.సి.డి.ఎస్. పీడీ స్రవంతి సరెండ్ కు కారణం దివ్యాంగుల బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా నెలకొన్న వివాదమేనట. ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంపై, సదరు మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వివాదమే సరెండర్ కు కారణంగా ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి.

ఇక కొద్ది నెలల క్రితం ఆర్.ఆండ్.బి.ఈఈ హన్మంతరావు ఆకస్మిక బదిలీకి ఇలాంటి కారణమే ఉందనే టాక్ నడుస్తోంది. ఎంపీ నిర్వహించిన ఓ సమీక్షకు ఆర్.ఆండ్.బి. ఈఈ వెళ్ళడం అధికార పార్టీ నేతలకు కోపం తెప్పించిందట. ఫలితంగా ఆయనకు రాత్రికి రాత్రే బదిలీ ఉత్తర్వులు ఇచ్చారట. ఇలా కొద్ది నెలల వ్యవధిలో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవడం పట్ల జిల్లా స్దాయి అధికారులు ఎంపీ కార్యక్రమాలంటే హడలిపోతున్నారట. ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జరిగే దశ మీటింగ్ కు ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరు అవుతున్నారట. రెండు పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యం ఉండటం వల్ల పొసగడం లేదనే టాక్ నడుస్తోంది. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అధికారులకు ఇబ్బందికరంగా మారిందట.

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు బీజేపీ ఎంపీ- టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ వివాదం అధికారులకు తలనొప్పిగా మారుతోందట. ప్రోటోకాల్ వివాదం పేరుతో అధికారులపై వేటు వేస్తుండటం పట్ల జిల్లాలో పనిచేసేందుకు, ఎంపీ కార్యక్రమాల నిర్వహణకు వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చూడాలి, ప్రభుత్వాధికారులకు తలనొప్పిగా మారిన, ఈ వివాదానికి ఎలా ఫుల్‌స్టాప్‌ పడుతుందో అసలు పడుతుందో పడదో.

Full View 

Tags:    

Similar News