ఇవాళ హైదరాబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్‌షా
Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం
Hyderabad: కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇతర దిగ్గజ నేతలు హాజరవుతోన్న ఈ సమావేశానికి మినీ ఇండియా లాంటి గ్రేటర్ సిటీ అతిథ్యమిస్తోంది. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు కాషాయ శోభ సంతరించుకున్నాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ పతకాలతో అన్ని దారులూ హైటెక్స్ వైపే అన్నట్లుగా తీర్చిదిద్దారు. భిన్న రాష్ట్రాల... సంస్కృతులు..ఆచార వ్యవహారాలు కలగలిసిన భాగ్యనగరంలో గంగా జమునా తహజీబ్ లాంటి మిశ్రమ సంస్కృతి ఏళ్లుగా కొనసాగుతుండడంతో ఇక్కడే సమావేశాల నిర్వహణకు బీజేపీ అధినాయకత్వం ఆసక్తి చూపింది.
ఆయా నియోజకవర్గాల పరిధిలో అన్ని వర్గాల్లో పార్టీ ఎజెండానూ ముందుకు తీసుకెళ్లడంతోపాటు గ్రూపు తగాదాలు లేకుండా బీజేపీ అనుబంధ సంఘాలను సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడం, బూత్‌స్థాయి కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా పార్టీ నేతల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు ముందుగానే వ్యూహాత్మకంగా కమలం పార్టీ పావులు కదుపుతుండడంతో ఆ పార్టీ క్యాడర్, నేతల్లో జోష్ నెలకొంది. ముఖ్యమైన నేతలు మాత్రమే హాజరయ్యే కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పార్టీ క్యాడర్‌కు సరికొత్తగా దిశానిర్దేశం చేయనున్నారు. గ్రేటర్‌లో కమలం పార్టీ కేడర్‌లో నయా జోష్ నెలకొంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ అగ్రనేతలు నగరాన్ని సందర్శిస్తుండడం, వీరంతా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండడంతో వారిలో నూతన ఉత్సాహం నెలకొంది.