ఆయన మలివిడత తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త. మేధావులను, విద్యావంతులను ఉద్యమం వైపు నడిపించిన వ్యక్తి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్‌తో విబేధించి కొత్త పార్టీ పెట్టారు. ఆయనే ప్రొఫెసర్ కోదండరాం. జేఏసీ చైర్మన్‌గా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న కోదండరాం పార్టీ పెట్టి తప్పు చేశారా? ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోదండ మంత్రం రాజకీయాల్లో మాత్రం ఎందుకు తుస్సుమంది? నిన్నా మొన్నటి వరకు అందరికీ కావాల్సివచ్చిన ఆ సారు ఇప్పుడు ఎందుకు ఒంటరివాడయ్యారు?
తెలంగాణ ఉద్యమంలో అటు కేసీఆర్ నుంచి ఇటు అన్ని పార్టీల నేతలతో పాటు సాధారణ ప్రజల వరకు సారు అని పిలిపించుకున్న వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్. మలిదశ ఉద్యమంలో ఆయనది చాలా కీలక పాత్ర. జేఏసీ ఛైర్మన్‌గా రాజకీయ పార్టీలు స్తబ్దుగా ఉన్న సమయంలోనూ ఉద్యమం సజీవంగా ఉండేందుకు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్ర సాధన తరువాత టీఆర్ఎస్‌కు వ్యతిరేక జెండా ఎగురవేసి తనదైన శైలిలో పోరుబాట పట్టారు. తెలంగాణ జన సమితి పేరుతో ఓ పార్టీ ఏర్పాటు చేసిన ఆయన ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారు. కానీ అక్కడే సీను రివర్సైంది.
మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ మైండ్ గేమ్‌తో షాక్క్‌కు గురైన కోదండరాం అటు కూటమిని వీడలేక ఇటు ఏమి చేయాలో తోచక నానా హైరానా పడ్డారు. వాస్తవానికి టీఆర్ఎస్ వ్యతిరేకతే ప్రధాన అజెండాగా ఉద్యమ నేపథ్యమే అండగా తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసిన కోదండరాం ఆదిలోనే తప్పటడుగులు వేశారు. పార్టీ స్థాపించే కన్నా ముందు పలువురు నాయకులు కోదండరాంను కలిసినా పార్టీ స్థాపించిన తరువాత మాత్రం ఎవరూ చేరిన పాపాన పోలేదు. కోదండరాం, కపిలవాయి దిలీప్‌కుమార్ తరువాత పెద్దగా జనాలకు పరిచయం ఉన్న నాయకులు పార్టీలో ఒక్కరంటే ఒక్కరు లేకుండా పోయారు. ఇక ప్రజా సమస్యల పోరాటం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నో కార్యక్రమాలు చేసినా పెద్దగా స్పందన రాలేదు. నిజానికి జేఏసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కోదండరాం వెంట ఉండి నడిచిన వారు ఎవరూ పార్టీ పెట్టిన తరువాత వెంట లేకుండా పోయారు.
ఎన్నికల ఫలితాల్లో కోదండరామ్ నేతృత్వంలోని పార్టీ ఘోరంగా ఓడిపోవడం టీజేఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవటంతో ఆ పార్టీ పవర్ ఏంటో తేలిపోయింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ బోణీ కోట్టలేకపోయింది. ఎన్నికల సమయంలో కాస్త సందడిగా కనిపించిన టీజేఎస్ ఆఫీస్ ఆ తరువాత బోసిపోయింది. పార్టీని మరో ఐదేళ్లు నెట్ట్టుకు రావటం అంత ఈజీ విషయమైతే కాదు. చట్టసభల్లో చోటుదక్కుంచుకోని టీజేఎస్ అటు బయట కూడా పెద్దగా ప్రజా సమస్యలపై పోరాటం చేయటంలో ప్రభావం చూపలేకపోతోంది. ఉద్యమ సమయంలో తిరుగులేని వ్యక్తిగా గుర్తింపు పొందిన కోదండరామ్ ఇపుడు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని, కోదండరామ్‌లాంటి సున్నిత మనస్కులకు రాజకీయాలు ఏమాత్రం సూట్ కావని తెలంగాణ వాదులు గుసగుసలాడుతున్నారు.
ఉద్యమసారధిగా జేజేలు అందుకున్న కోదండరామ్ రాజకీయాల్లో కొనసాగాలా వద్ద అనే విషయంలో తన సన్నిహితులతో సీరియస్‌గానే చర్చిస్తున్నారని టాక్. ఏదేమైనా ఉద్యమంలో అందరికీ అవసరమైన వ్యక్తి ఇప్పుడు మాత్రం ఎవ్వరికీ కాకుండా పోయాడని పాపం కోదండరాం సర్ అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.