Osmania Hospital Doctors Protest: ఉస్మానియాను కూల్చండి.. వైద్యుల నిరసన..
Osmania Hospital Doctors Protest : ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భారత దేశంలో పేరు గాంచిన ఆసుపత్రి.
Osmania Hospital Doctors Protest : ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భారత దేశంలో పేరు గాంచిన ఆసుపత్రి. ఈ ఆసుపత్రి తెలంగాణ రాజధాని హైదరాబాదులోని అఫ్జల్ గంజ్లో ఉంది. ఆఖరు నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించబడి తర్వాత అతని పేరు మీద ప్రసిద్ధికెక్కింది. అయితే కొద్ది రోజుల క్రితం నగరంలో కురిసిన వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రి పూర్తిగా నీటితో నిండిపోయిన విషయం తెలిసిందే. ఎంతో మందికి సేవలందిస్తున్న అతిపురాతనమై ఈ భవనం శిథిలావస్థలో ఉండడంతో ఆస్పత్రి భవనాన్ని కూల్చి.. కొత్త ఆస్పత్రిని నిర్మించాలని ఉస్మానియా వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతే కాదు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని కాపాడండి అంటూ వైద్యులు బ్యానర్లు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. పాత భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని కట్టాలని వారు కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని వైద్యులు తేల్చిచెప్పారు. కూలిపోతున్న బిల్డింగ్‌ను కూల్చవద్దు అంటూ కొందరు అడ్డుపడడం వారి అవివేకానికి నిదర్శనమని డాక్టర్లు ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ఉన్న 1168 పడకలలో 363 పడకలు సూపర్ స్పెషాలిటీ, 160 ఎమర్జన్సీ, 685 సాధారణ పడకలు ఉన్నాయి.
ఇక పోతే ఈ ఆస్పత్రి భవనాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ దీన్ని కూల్చి కొత్త బిల్డింగ్ నిర్మించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని డాక్టర్లు గుర్తు చేశారు. కానీ ఆ సమయంలో కొంత మంది ప్రతిపక్షనాయకులు మాత్రం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని, కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారని తెలిపారు. ఇది సరైనది కాదని వైద్యులు అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ఉన్న చోట నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలని, దానికి అడ్డు పడితే సహించేది లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. రోగుల ప్రాణాలను కాపాడడానికి ఈ ఆస్పత్రిని కట్టారని కానీ ఇప్పుడు అది కూలి రోగులతో పాటు వైద్యుల ప్రాణాలు తీసేలా ఉందన్నారు. కచ్చితంగా ఉస్మానియా ఆస్పత్రిని నూతనంగా నిర్మించి తీరాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు.