ఆ జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పార్టీకి ఇప్పుడు క్యాడర్ కరువవుతోంది. పట్టించుకునే వారు లేక ఆగమైపోతోంది. నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలు కరువై క్యాడర్‌కు భరోసానిచ్చే నాయకుల్లేక, హస్తం పార్టీ సంక్షోబాన్ని ఎదుర్కోంటోంది. మున్సిపల్ ఎన్నికల వేళ, క్యాడర్‌కు భరోసానిచ్చే నేతల్లేక, శ్రేణులు దూరమైపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల టైంలో, బాధ్యతలు మోసేదెవరో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుటి కాంగ్రెస్ కంచుకోటలో అసలేం జరుగుతోంది?
మున్సిపల్ ఎన్నికల వేళ, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కొంత మంది నేతలు నియోజకవర్గాల వైపు కనెత్తి చూడటం లేదు. సీనియర్లుగా చెప్పుకునే నేతలు సైతం జిల్లాకు ముఖం చాటేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం, ఆర్మూర్ ఇంచార్జీగా ఉన్న ఎమ్మెల్సీ ఆకుల లలిత కారెక్కగా, ఎల్లారెడ్డి నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన జాజుల సురేందర్ సైతం గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో రెండు నియోజకవర్గాలకు ఇంచార్జీలు కరువయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతుంటే కొన్ని చోట్ల ఇంచార్జీలు లేక మరికొన్ని చోట్ల నాయకులు రాక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ శ్రేణులకు భరోసానిచ్చే నేతలు పార్టీలో లేక, ముఖ్యనేతలు సైతం పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉండటం, హస్తం శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో ఓటమి పాలైంది కాంగ్రెస్. షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో, జోష్‌గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీకి, ఆ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. 9 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పరాజయం పాలుకావడంతో పార్టీ శ్రేణులు నిరాశ చెందాయి. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొంత పోటీనిచ్చినా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్, పరిషత్ ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ మూడో స్థానానికి పడిపోవడం, జడ్పటీసీ పోరులో, కేవలం రెండు స్థానాలు గెలుచుకోవడం కాంగ్రెస్ శ్రేణులను నిస్తేజంలోకి నెట్టాయి. ఇక మున్సిపల్ ఎన్నికల బాధ్యత తీసుకునే లీడర్ లేక ఆశావాహులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్‌కు ముఖ్యనేతలుగా చెప్పుకునే కొందరు సీనియర్ లీడర్లు, మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది. జిల్లా అధ్యక్షుడు ఉన్నా ఆయన కొందరివాడిగా ప్రచారం జరుగుతోంది. ఫలితంగా మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షలా మారాయి. సవాళ్ల మధ్య క్యాడర్‌ను, నేతలు ఎలా కాపాడుకుంటారో పార్టీని విజయ పథాన ఎలా నడిపిస్తారో చూడాలి.