తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకింది.. వారితో పాటూ గన్‌మెన్‌లు, డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవారికి కూడా పాజిటివ్ తేలింది. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డ్రైవర్‌తో పాటు గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. గత ఆదివారం ఎమ్మెల్యేకు, గురువారం ఆయన సతీమణికి వైరస్ సోకగా.. తాజాగా గన్‌మెన్, డ్రైవరు కరోనా బారినపడ్డారు. జిల్లాలో ఓ ఫొటో జర్నలిస్టుతో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన సతీమణి, కుమార్తెకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఇందులో 2,976 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,352 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 198 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.