వాళ్లు రాష్ట్ర స్దాయి నేతలు జాతీయ స్ధాయిలో పార్టీలో గుర్తింపు ఉన్న లీడర్లు..జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నా, కష్టకాలంలో వాళ్లెక్కడున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు మెరుపు తీగల్లా అప్పుడప్పుడు మెరుస్తున్నా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టక తలోదారిలో పయనిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆ లీడర్లు జిల్లాకు వస్తారా..? ఎప్పటిలాగే అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తారా అన్నది కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు. అసలా నేతలు పార్టీలో ఉన్నట్లా లేనట్లా అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు పార్టీ క్యాడర్.
ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ ప్రాంతానికి చెందిన నేతలు రాష్ట్ర స్దాయిలో ఓ వెలుగు వెలిగారు. జాతీయ స్ధాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మాజీ పీసీసీ ఛీఫ్ డి. శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీలు ఉండగా గత ఎన్నికల్లో మాజీ పీసీసీ ఛీఫ్ డి.ఎస్., మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కారెక్కేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీలు సీనియర్లుగా పార్టీకి పెద్దదిక్కు అయ్యారు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు, షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీని కనుసన్నల్లో నడిపిస్తున్నారట.
మధుయాష్కీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సీనియర్‌గా ఉన్నట్లు చెబుతున్నారట. పేరుకు పెద్ద లీడర్లుగా ఉన్న ఈ ముగ్గురు నేతలు జిల్లా పార్టీ కార్యాలయానికి ముఖం చాటేశారట. పార్టీని పట్టించుకోవడం లేదట. ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనక తమ నేతలు అసలెక్కడున్నారో తెలియక కార్యకర్తలు ఆగమాగం అవుతున్నారట. ఆర్టీసీ సమ్మెలో సైతం అంతగా పార్టీ శ్రేణులు పాల్గొనకపోవడానికి ఆ ముగ్గురు నేతలే కారణమని బహిరంగంగానే చెబుతున్నారట. కష్టకాలంలో ఉన్న పార్టీకి అండగా ఉండి కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సిన నేతలే పట్టించుకోక తలోదారిలో నడుస్తుండటంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారట కార్యకర్తలు.
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాలో అత్యంత సీనియర్ ఆయన ఎన్నికలొస్తేనే కనిపిస్తారనే టాక్ ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయిష్టంగానే పోటీ చేసిన ఆయన, ఓటమి అనంతరం అడపాదడపా జిల్లాకు వచ్చిపోతుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ ఎంపీ మధుయాష్కీ జిల్లాకు ముఖం చాటేశారట. భువనగిరి సీటు కోసం పోటీ పడ్డ మధుయాష్కీ, అక్కడ బెర్త్ దొరక్కపోవడంతో నిజామాబాద్ లోక్‌సభకు కష్టంగా పోటీకి చేశారు. అంతంత మాత్రంగా ప్రచారం చేసి ఓటమిపాలయ్యారు. ఫలితాల రోజు కనిపించిన ఆయన, మళ్లీ ఇప్పటి వరకు జిల్లా నేతలకే దర్శనం ఇవ్వలేదట.
మరో ముఖ్య నేత షబ్బీర్ అలీ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నా కామారెడ్డికి అడపాదడపా వస్తూ మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారట. ఉదృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెలో సైతం ఈ బడా నేతలు కనిపించక కార్యకర్తలతో పాటు ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక ద్వితీయ శ్రేణి నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఆర్టీసీ సమ్మెను తమకు అనుకూలంగా మార్చుకుంటూ మిగతా పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తుంటే, అంతోకొంత కార్యకర్తల బలం ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం, అంతగా పట్టించుకోకుండా అంటీముట్టనట్లు వ్యవహారిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ, బడానేతలు తలోదారిలో వెళ్తుంటే, పార్టీ సింబల్‌పై పోటీ చేయాలా లేక స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో నిలవాలా అని ఆశావాహులు మల్లగుల్లాలు పడుతున్నారట. ఇప్పటికైనా ఆ ముగ్గురు లీడర్లు, పార్టీపై ఫోకస్ చేసి శ్రేణులు పుల్ టైం కేటాయిస్తే తప్ప క్యాడర్‌లో ఉత్తేజం వచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. అలా కాకుండా ఇంకా పార్టీకి దూరం దూరంగా ఉంటే రాబోయే రోజుల్లో ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతలను, జెండా మోసిన కార్యకర్తలే మరచిపోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు ఇందూరు ప్రజలు.