మాజీ ఎమ్మెల్యే ఇంటి పక్కనే మర్డర్.. 10 రోజులు అవుతున్నా వీడని మిస్టరీ
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఈ నెల 17న హత్యకు గురైన ఓ మహిళ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు.
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఈ నెల 17న హత్యకు గురైన ఓ మహిళ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఇంటి పక్కనే మహిళ హత్య జరగడంతో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇంత వరకూ నిందితులను పోలీసులు పట్టుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
పట్టణంలోని సీతారామనగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే వీరయ్య ఇంటి పక్కనే నివాసముంటోన్న తమ్మళ్ల మాణిక్యమ్మపై ఈ నెల 17న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న మాణిక్యమ్మను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు, హైదరాబాద్ తరలించాలని సూచించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
తన తల్లిపై దాడి జరిగిందన్న సమాచారం తెలియగానే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపాడు మృతురాలి కుమారుడు రాజేశ్. దాడికి పాల్పడిన వారిని గుర్తించడంతో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా నిందితులను గుర్తించడంలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పలువురు అనుమానితుల పేర్లు చెప్పినా వారిని విచారించలేదని పోలీసులను ప్రశ్నించాడు.
తన తల్లి హత్య వెనుక కొందరు బడాబాబుల హస్తం ఉన్నట్లు మృతురాలి కుమారుడు రాజేశ్ ఆరోపించాడు. మాజీ ఎమ్మెల్యే ఇంటి పక్కనే హత్య జరిగినా.. కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డాడు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నా పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయలేదని ఆరోపించాడు. అసలు తన తల్లిని హత్య చేయడానికి కారణమేంటనే దానిపై ఇంతవరకు గుర్తించలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందాడు.