ఉత్తమ్‌కు ఆఖరి బరిగా పురపాలిక పోరు.. విజయంతో సగౌరంగా పీఠం దిగాలని లాస్ట్‌‌ ఫైట్‌

Update: 2020-01-15 06:24 GMT

సంక్రాంతి బరి, మరో నాయకుడికీ, ప్రతిష్టాత్మకంగా మారింది. మొన్నటి వరకు దాదాపు అన్ని ఎన్నికల్లోనూ, ఆయన నాయకత్వంలో ఘోర పరాజయాలే. ఈనెలలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికలే, ఆయన నాయకత్వంలో చివరివి. దీంతో పురపాలికల్లో విజయం సాధించి, కెప్టెన్సీ నుంచి దిగిపోవాలనుకుంటున్నారు ఆ లీడర్. మరి గులాబీ పుంజులు కత్తులు దూయడానికి సిద్దంగా వున్న నేపథ్యంలో, ఈ ఆఖరి బరిలోనైనా ఆ నాయకుడు సత్తా చాటుతాడా? స్థానిక సంగ్రామంలో విజయపతాకం ఎగరేసి, గాంధీభవన్‌ సింహాసనం సగౌరంగా దిగిపోతారా?

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, ఈ మున్సిపల్ ఎన్నికలు దాదాపు చివరి ఎన్నికలు. ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించి ఉత్తమ్, పురపాలిక ఎలక్షన్స్ తర్వాత దిగిపోతానంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ పోరులో ఏమత్రం సత్తాచాటలేకపోయిన ఉత్తమ్, తన సొంత నియోజకవర్గంలో, భార్యను సైతం గెలిపించలేక చతికిలబడ్డారు. దీంతో పీసీసీ పగ్గాల నుంచి ఉత్తమ్ తప్పుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు, ఉత్తమ్‌కు ఆఖరి పరీక్షగా మారాయి.

మున్సిపల్‌ ఎన్నికలకు అటు టీఆర్ఎస్‌ సమరోత్సాహంతో ఉరకలెత్తుతుంటే, కాంగ్రెస్‌ మాత్రం ఇంకా సిద్దంకాలేదని తెలుస్తోంది. గెలిచినా, ఓడినా ప్రస్తుతానికి ఇవే ఉత్తమ్ నాయకత్వంలో చివరి ఎన్నికలని భావిస్తున్న తరుణంలో, ఏ లీడరు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు కనపడటంలేదు. తన లీడర్‌షిప్‌ ఆఖరి ఎలక్షన్స్‌ కావడంతో, ఉత్తమ్ కుమార్‌ రెడ్డే అడపాదడపా జిల్లా నాయకులతో మాట్లాడి, సత్తా చాటాలని కోరుతున్నారు. మొత్తానికి పురపాలికల్లో గెలిచినా, ఓడినా ఉత్తమ్ పీసీసీ సింహాసనం దిగిపోవడం ఖాయం. అయితే, విజయంతో గౌరవప్రదంగా దిగిపోవాలన్నది ఉత్తమ్ ఆలోచన. మరి సంక్రాంతి బరిలో దూకుడు మీద కనిపిస్తున్న కేటీఆర్‌ను ఢీకొని, ఉత్తమ్‌ లాస్ట్‌ ఫైట్‌లోనైనా టఫ్‌‌ ఫైట్‌ ఇస్తారా?


Full View

 

Tags:    

Similar News