మూడు కొండలెక్కి, వాగు దాటి గిరిపుత్రులకు వైద్యసేవ చేసిన ములుగు జిల్లా వైద్యశాఖ అధికారి అప్పయ్య

పెనుగోలులో 39 మంది నివసిస్తున్నారు. వేసవిలో ఈ తండాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవచ్చు. వర్షాకాలంలో మాత్రం వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. జూలై 16న ఉదయం ఈ గ్రామానికి తన సిబ్బందితో అప్పయ్య బయలుదేరారు.

Update: 2024-07-19 15:04 GMT

మూడు కొండలెక్కి, వాగు దాటి గిరిపుత్రులకు వైద్యసేవ చేసిన ములుగు జిల్లా వైద్యశాఖ అధికారి అప్పయ్య

చేతిలో కర్ర, నడుము లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న ఈయనే ములుగు జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ అప్పయ్య . తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న పెనుగోలు గిరిజన తండాలో ఉంటున్న 10 కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు 16 కి.మీ. నడుచుకుంటూ వెళ్లారు. అడవిలో సాహసం చేసిన అప్పయ్యను పలువురు అభినందిస్తున్నారు.


 మూడు కొండలు ఎక్కి... వాగులు దాటుకుంటూ

పెనుగోలులో 39 మంది నివసిస్తున్నారు. వేసవిలో ఈ తండాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవచ్చు. వర్షాకాలంలో మాత్రం వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. జూలై 16న ఉదయం ఈ గ్రామానికి తన సిబ్బందితో అప్పయ్య బయలుదేరారు. మార్గమధ్యలోని మూడు కొండలు ఎక్కి దిగారు. సహచర సిబ్బంది సహాయంతో వాగులు దాటారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ప్రయాణం కొనసాగించారు. రాత్రి ఏడుగంటలకు గిరిజన గూడెం చేరుకున్నారు.

గిరిజన గ్రామంలో వైద్య శిబిరం

రాత్రిపూట గిరిజన గ్రామం చేరుకున్న డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే గ్రామంలో ఇద్దరికి మలేరియా సోకిందని పరీక్షల ద్వారా గుర్తించారు. తమ వెంట తెచ్చుకున్న దోమతెరలను గ్రామస్తులకు అందించారు. దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారు. జూలై 17 మధ్యాహ్నం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గతంలో కూడా ఆయన మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించారు.


 ఏజెన్సీ గ్రామాల్లో విధి నిర్వహణకు ఇబ్బందులు

ఏజెన్సీ గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేని కారణంగా ప్రజలు తరచుగా అనారోగ్యం పాలౌతుంటారు. అయితే ఈ గ్రామాలకు వెళ్లాడానికి వైద్య సిబ్బంది చాలా కష్టపడుతుంటారు. పెనుగోలుకు వెళ్లే సమయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది పడే కష్టాలను స్వయంగా జిల్లా వైద్యశాఖాధికారి తెలుసుకున్నారు. కరోనా సమయంలో ఇలాంటి మారుమూల గ్రామాల్లోని గిరిజనులకు ప్రస్తుత మంత్రి సీతక్క ఆహారం, మందులు స్వయంగా అందించారు. ఏటూరు నాగారం, వాజేడు, తాడ్వాయి మండలాల్లో 351 గ్రామాలున్నాయి. ఇందులో 73 గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. వర్షాకాలంలో ఈ గ్రామాలకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లేందుకు చాలా కష్టపడుతుంటారు.

పెనుగోలులో వైద్య శిబిరం నిర్వహించిన అప్పయ్య బృందాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.

Tags:    

Similar News