ఏడాదిపాటు పీవీ శతాబ్ది ఉత్సవాలు: కేశవరావు
బడుగు, బలహీన వర్గాలకు పీవీ నరసింహరావు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని, ఎల్పీజీ సృష్టికర్త అని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు పీవీ నరసింహరావు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని, ఎల్పీజీ సృష్టికర్త అని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల లోగోను గురువారం కేశవరావు రవీంద్ర భారతి లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ పీవీ సామాజిక విప్లవం తీసుకొచ్చిన నేత అని, దేశనాయకుడని అన్నారు. పీవీ జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాలు ఈనెల 28న ప్రారంభమవుతాయని, ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు.
జయంతి వేడుకల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారని కేశవరావు తెలిపారు. పీవీ డాక్యుమెంటరీని తయారు చేస్తామని, పీవీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కమిటీని విస్తరిస్తాన్నారు. తెలంగాణ బిడ్డలుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమని, ఉత్సవాలపై పలు కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. దేశం గర్వించే నేత, విద్యా సంస్కరణలు అనేకం తీసుకొచ్చారని పీవీ నరసింహరావును ప్రశంసించారు. ఆర్థిక సంస్కర్తగా, భూసంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా పీవీకి మంచి పేరు ఉందన్నారు. అనంతరం పీవీ నరసింహరావు కుమార్తె వీణాదేవి మాట్లాడుతూ శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వేడుకలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం వినోద్ మాట్లాడుతూ కేశవరావు నాయకత్వంలో కేసీఆర్ ఓ కమిటీని ఏర్పాటు చేయడం హర్షనీయమని తెలిపారు. దక్షిణ భారత్ నుంచి దేశాన్ని పాలించిన నేత పీవీ అని వినోద్ గుర్తు చేశారు. రాజకీయాల కారణంగా ఆయనకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాభై దేశాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాన్నకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం ఆయన పని చేశారని గుర్తు చేశారు. ప్రపంచ పటంలో దేశం గర్వపడేలా తీర్చిదిద్దిన నేత పీవీ అని, దేశ ఆర్ధిక స్థితిగతుల్ని మార్చిన నేత అని పేర్కొన్నారు. ఉత్సవాలు నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయం గొప్పదని పీవీ ప్రభాకర్ అన్నారు. పీవీ గురించి తెలిసింది తక్కువ అని తెలియాల్సింది ఎక్కువ ఉందన్నారు. ఇదే విషయాన్ని అటల్ జీ కూడా చెప్పారన్నారు. ఇవాళ చంద్ర మండలం వెళ్తున్నామంటే పీవీ వేసిన బాటలేనని ప్రభాకర్ పేర్కన్నారు.