CoronaVirus: 80 శాతం మందిలో కోవిడ్ లక్షణాల్లేవు.. అయినా పాజిటివ్ గా నిర్ధారణ
CoronaVirus: తెలంగాణలో కొత్తగా 3,307 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
CoronaVirus: తెలంగాణలో కొత్తగా 3,307 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కేసుల నిర్ధారణ ప్రారంభమైన తర్వాత ఒక్కరోజులో ఇంత భారీగా సంఖ్యలో ఎప్పుడూ కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతికి ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని వైద్యనిపుణులు అంటున్నారు. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య రాష్ట్రంలో 3,38,045కు పెరిగింది.
వీరిలో ఎటువంటి లక్షణాల్లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవారు 80.3 శాతం కాగా, లక్షణాలతో ఉన్న కొవిడ్ బాధితులు 19.7 శాతంగా నమోదయ్యారు. పాజిటివ్‌లలో పురుషులు 61.5 శాతం మంది, మహిళల్లో 38.5 శాతం మంది ఉన్నారు. మహమ్మారి బారినపడి మరో 8 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకూ 1,788 మంది కరోనాతో కన్నుమూశారు. మొత్తం పాజిటివ్‌లతో పోల్చితే మరణాల రేటు 0.52 శాతంగా నమోదైనా.. పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో..మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
అందుకే పాజిటివ్ రేటును తగ్గించడం ద్వారా మరణాల రేటును కూడా తగ్గించడానికి మార్గం సులభమవుతుందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈనెల 14న (బుధవారం) రాత్రి 8 గంటలవరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు.