Harish Rao Reviews on Coronavirus Patients: కరోనా బాధితులను ఫోన్ లో పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
Harish Rao Reviews on Coronavirus Patients: కంటికి కనిపించని కరోనా వైరస్ తెలంగాణలో ఉగ్రరూపం దాల్చింది.
Harish Rao Reviews Corona patients Condition: కంటికి కనిపించని కరోనా వైరస్ తెలంగాణలో ఉగ్రరూపం దాల్చింది. గత పది రోజులుగా వెయ్యికి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అధికార యంత్రాంగంలో కలవరం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి జిల్లాలో కరోనా పరిస్థితులపై కలెక్టర్ చాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొంత మంది కరోనా బాధితులను మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. వారికి వైద్యులు ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతే కాక ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న వారికి వైద్య ఆరోగ్య సిబ్బంది ఏ విధంగా సేవలు అందిస్తున్నారో తెలుసుకున్నారు. సిబ్బంది బాధితులను సందర్శించి సేవలు, సూచనలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా బాధితులు ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నారో అడిగి తెలసుకున్నారు. సిబ్బంది తరచుగా వచ్చి పరీక్షలు చేస్తున్నారా? లేదా? అని అడిగారు. ఈ ప్రశ్నలకి క్వారంటైన్ లో ఉన్న బాధితులు సానుకూలంగా సమాధానం ఇవ్వడంతో హరీశ్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, కరోనా బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా వ్యవహరించాలని సూచించారు.
ఇక పోతే తెలంగాణ లో శనివారం 1850 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,312కు చేరగా.. కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 5 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 288కు చేరింది. శనివారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1572 కేసులు వచ్చాయి. ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 92, మేడ్చల్ జిల్లాలో 53, కరీంనగర్ జిల్లాలో 18 వరంగల్ అర్బన్ 31 , న్సల్గొండ జిల్లాలో 10 నిజామాబాద్ జిల్లాలో 17 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
కొత్తగా 1342 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 11,537 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,487 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. శనివారం కొత్తగా 6,427 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,10,545 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే శుక్ర , శని వారాల్లో కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. శుక్రవారం ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు చెందిన కరోనా పరీక్షల్లో అనుమానాలు ఉండటంతో లెక్కలోకి తీసుకోలేదు.