మంత్రి గంగుల స్వీట్ వార్నింగ్ .. తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు.. కానీ,
తెలంగాణ మినిస్టర్ గంగుల కమలాకర్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నేతలను ఆయన హెచ్చరిస్తున్నారు. గత కొంత కాలంగా ఎంతో ఓపికతో ఉన్న గంగుల మున్సిపల్ ఎన్నికలతో ఒక్కసారిగా ఓపెన్ అయ్యారు. తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు కానీ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను క్షమించేది లేదంటున్నారు. అయితే ఈ వార్నింగ్ సొంత పార్టీలోని కొంతమంది వ్యతిరేకులుగా ముద్రపడ్డ వారికేనని జనం అనుకుంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయాలు రంజుగా మారాయి. సొంతపార్టీలోని కొంతమంది ముఖ్య నేతలు పార్టీ అంతర్గత విషయాలను ప్రతిపక్షాలకు ఉప్పు అందిస్తున్నారని తెలిసినా ఎంతో ఓపికగా ఉన్న గంగుల ఇప్పుడు కోవర్టులందరికి షాక్ ఇచ్చేశారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారికి మంత్రి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఈ సైటర్లు వేయడానికి ఓ కారణముందంటున్నారు గంగుల వర్గీయులు. అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల ఓటమికి పని చేసిన వారినే టార్గెట్ చేశారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
మరోవైపు మంత్రి గంగుల భారీ డైలాగులు విసరడానికి చాలా రీజన్స్ ఉన్నాయంటున్నారు. మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు పార్టీని గెలిపించుకునేందుకు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. మంత్రిగా తనదైన స్టైల్‌లో పనిచేస్తూ జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారడంతో పాటు తానేంటో నిరూపించుకునే పనిలో పడ్డారంట.
పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నవారికి క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ చేశారని గంగుల వర్గీయులు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది తన ఓటమికి పనిచేస్తున్నారని తెలిసినా ఒంటరిగా నిలబడి గెలిచారు. ఇంతకాలం తనకు సమయం రాకపోతుందా వారు చిక్కకపోరా అంటూ వెయిట్ అండ్ సి ఫార్ములాను ఫాలో అయిన ఆయన తన తడఖా చూపించాలి అనుకుంటున్నారు. కట్ చేస్తే గంగులకు ఆ అవకాశం మున్సిపల్ ఎన్నికల రూపంలో వచ్చేసింది. ఇంకేముంది. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఏరిపారేయడానికి పక్కా వ్యూహరచన చేస్తున్నారట.
అయితే వెన్నుపోటుదారుల లిస్టులో మాజీ మేయర్‌తో పాటు సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నారంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల ఓటమికి వారంత గట్టిగా ప్రయత్నించారట. ఆ నేతలంతా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చారనే విమర్శలు కూడా పార్టీలో ఉన్నాయి. వీరితో పాటు మరో మంత్రికి సంబంధించిన అనుచరులు కూడా లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గంగుల మీడియా సమావేశానికి మాజీ మేయర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ సాగుతుందని చర్చించుకుంటున్నారు.
ఎన్నికలను గంగుల ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు అభివృద్ధే ఎజెండాగా రంగంలోకి దిగారు. పార్టీని గెలిపించుకునేందుకు అన్ని తానై వ్యవహరించడంతో పాటు అభ్యర్ధుల ఎంపిక మొదలుకొని ప్రతి అభ్యర్థిపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. గతంలో గంగులకు వ్యతిరేకంగా పని చేసి వెన్ను పోటుదారులుగా పేరు తెచ్చుకున్న వారికి టికెట్ రావడం రాకపోవడం పక్కన పడితే వారిపై గంగుల వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ వారు పోటిలోకి వస్తే గంగుల వారికి ప్రచారం చేస్తాడా లేక లైట్ తీసుకుంటారా అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది.