లవ్ లెటర్స్. లవ్ బ్రేకప్ లెటర్స్. సెంటిమెంట్ లెటర్స్. అఫీషియల్ లెటర్స్. లాస్ట్ బట్ లీస్ట్, సిఫారసు లెటర్ కూడా. ఇలా ఎన్నో, ఎన్నెన్నో లెటర్స్. కానీ ఒక సిఫారసు లేఖ, ఇప్పుడు గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక పదవి తనకు తెలిసిన వ్యక్తికి ఇవ్వాలంటూ, ఒక మంత్రి రాసిన ఉత్తరం, టీఆర్ఎస్ భవన్‌లో హాట్ డిస్కషన్‌కు దారి తీసింది. అసలు ఆ లేఖ మంత్రే రాశారా.. లేదంటే సీఎం చెబితే రాశారా. అందులో పదవి కోసం రెకమెండ్ అయిన వ్యక్తెవరూ అంటూ, అందరూ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ లేఖేంటి దాని వెనక స్టోరీ ఏంటి?
మంత్రి ఈటల రాజేందర్ లెటర్‌హెడ్‌తో ఉన్న ఈ లెటర్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లేఖ టిఆర్ఎస్‌లోని చాలామందికి అంతుచిక్కని రహస్యంలా మారిపోయింది.అసలు ఈ లేఖ మంత్రి ఈటల రాజేందర్ రాశారా ఆయనే రాస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా రాశారు అంటూ చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుమతితోనే ఈటల రాజేందర్ ఈ లేఖ రాశారని కొంతమంది వాదిస్తుంటే పెద్దాయనకి తెలియకుండా ఎలా రాస్తారు అంటూ సమాధానాలు కూడా వస్తున్నాయ్. ఈ లేఖ సారాంశం చూస్తే, మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గంలోని రమేష్ అనే వ్యక్తికి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పదవి ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ఇదీ లేఖ భావం.ఇది స్వయంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ లెటర్‌హెడ్‌తో ఉంది. అదే ఇప్పుడు టీఆర్ఎస్‌లో చర్చనీయాంశమైంది. అసలు ఎవరు ఈ దొంత రమేష్ ఈటల రాజేందర్‌కి దొంత రమేష్‌కి సంబంధమేంటన్న ప్రశ్నలు రయ్యిన దూసుకొస్తున్నాయి.
దొంత రమేష్ అనే వ్యక్తి, మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని గ్రామానికి చెందినవాడు. కొన్నేళ్లుగా తిరుమలలోని టీటీడీ సిబ్బందితో ఇటు రాష్ట్రంలోని పలువురు సీనియర్ నాయకులతో సత్సంబంధాలు మెయింటెన్ చేస్తూ, తిరుమలకు వెళ్లిన వీఐపీలకు, తనకు తెలిసిన సాధారణ పౌరులకు సేవలందిస్తున్నారని టీఆర్‌ఎస్‌లోనే వినికిడి. ఈ కారణంతోనే మంత్రి ఈటెల దొంత రమేష్‌కు టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పదవి ఇవ్వగలరని లేఖలో కోరారని తెలుస్తోంది. అయితే ఇదంతా సీఎం కేసీఆర్‌కు తెలిసే జరిగిందని పార్టీలోని మరికొందరు నాయకులు వాదిస్తున్నారు. కానీ ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారిపోయింది. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలో రమేష్ అనే వ్యక్తి ఎవరో తెలియని వారు, ఇప్పుడు ఎవరతను అంటూ ఆరా తీస్తున్నారు. ఆయనకు ఎందుకింత ప్రాధాన్యత, ఈస్థాయిలో రెకమెండ్ చేయాల్సిన అవసరమేంటని చర్చించుకుంటున్నారు. అయితే పార్టీలో ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కచ్చితంగా అధినేత కేసీఆర్‌కి తెలిసే ఉంటుందని ఆయన అనుచరులు కుండబద్దలు కొడుతున్నారు. ఏది ఏమైనా ఒకే ఒక్క లేఖ టిఆర్ఎస్ పార్టీలోని పలువురు మధ్య చర్చకు దారి తీసింది.